Begin typing your search above and press return to search.

అమెరికా కొత్త లెక్క‌లు...హెచ్‌1బీ ఆశ వదులుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   5 Jun 2019 3:47 PM GMT
అమెరికా కొత్త లెక్క‌లు...హెచ్‌1బీ ఆశ వదులుకోవాల్సిందేనా?
X
త‌మ నైపుణ్యాల‌తో అమెరికాను అభివృద్ధికి కృషి చేస్తున్న భార‌తీయుల విష‌యంలో...అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిబంధ‌న‌ల పేరుతో అడ్డుక‌ట్ట వేసే ప్ర‌క్రియ‌ను వైట్ హౌస్‌ లో అడుగుపెట్టిన నాటి నుంచే మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌ధానంగా హెచ్‌-1బీ వీసాను పేర్కొన‌వ‌చ్చు. హెచ్‌-1బీ అనేది వలసదారు విధానానికి చెందిన ఓ వీసా. ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతి పొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వెళ్తున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి 75.6 శాతానికి చేరుకుంది. అయితే, తాజాగా హెచ్‌1బీ వీసాల విష‌యంలో ఇక ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌నే గ‌ణాంకాల‌ను అమెరికా వెలువ‌రించింది.

హెచ్‌1బీ వీసాల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో జారీకి కళ్లెం వేశామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్రిగేషన్ సర్వీసెస్ (యూఎస్‌ సీఐఎస్) తెలిపింది. ఈ ప్ర‌భుత్వ సంస్థ వెల్ల‌డించిన వివ‌రించిన వివ‌రాల ప్ర‌కారం ఐటీ నిపుణులు అమెరికా వెళ్లేందుకు అత్యధికంగా వినియోగించే హెచ్‌1బీ వీసాల జారీ తగ్గిపోయింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2018లో వీటి జారీ 10శాతం తగ్గింది. 2018 సంవత్సరానికి గాను రెన్యూవల్స్‌ సహా కలిపి 3,35,000 హెచ్‌1బీ వీసాలను మాత్రమే మంజూరు చేశారు. ఇవే వీసాలు 2017లో 3,73,400 మంజూరు అయ్యాయి. అంటే 2017లో వచ్చిన ప్రతి 100 దరఖాస్తు 93కు ఆమోద ముద్రపడగా.. 2018 నాటికి కేవలం 85కు మాత్రమే గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

ఇదిలాఉండ‌గా, హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు పని చేసేందుకు వీలు కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆదేశాల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌న్నెర్ర చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వెసులుబాటు వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోయాయని అందువల్ల హెచ్‌-4 వీసాదారులకు వర్క్‌ పర్మిట్‌ ను రద్దు చేస్తామని గ‌త‌ ఏడాది ఫ్రిబ్రవరి 28న ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. ఇటీవ‌ల వర్క్‌ పర్మిట్‌ రద్దుపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నిర్ణ‌యంపై అన్నివ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలోనే...హెచ్‌1బీ జారీ ప్ర‌క్రియ‌లో ఇలా క‌త్తెర వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.