Begin typing your search above and press return to search.

షర్మిలతో ఆర్కే టీజరే హాట్ టాపిక్.. మొత్తం ఇంటర్వ్యూ మాటేంటి?

By:  Tupaki Desk   |   25 Sep 2021 8:30 AM GMT
షర్మిలతో ఆర్కే టీజరే హాట్ టాపిక్.. మొత్తం ఇంటర్వ్యూ మాటేంటి?
X
గడిచిన కొద్దికాలంగా మీడియా వర్గాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన ఆంధ్రజ్యోతి ఆర్కే ‘ఓపెన్ హార్ట్’ సీజన్ 3 మళ్లీ షురూ కానుంది. మిగిలిన రెండు సీజన్లకు భిన్నంగా తాజా సీజన్ ఆరంభంలోనే తెలంగాణ రాజకీయ సంచలనంగా మారిన షర్మిలతో ఇంటర్వ్యూ చేపట్టటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైఎస్ కుటుంబానికి ఆంధ్రజ్యోతికి మధ్యనున్న పంచాయితీ తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పిల్లాడికి కూడా తెలిసిందే. అలాంటిది.. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే నిర్వహించే ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో ఇంటర్వ్యూ కోసం షర్మిల ముందుకు రావటం.. దానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై సంచలనంగా మారింది.

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన రెండున్నర నిమిషాలకు పైగా టీజర్ లో పలు అంశాలు ప్రస్తావించటమే కాదు.. మొత్తం ఇంటర్వ్యూ మీద మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. మిమ్మల్ని ఇంట్లో అందరూ షమ్మీ అంటారు కదా? నేను షర్మిల అని పిలవాలా? షమ్మి అని పిలవాలా? అన్న ఆర్కే మాటకు బదులిచ్చిన షర్మిల.. మీ ఇష్టమన్నా.. అనటం.. నాకంటే చిన్నదానివే కదా.. షమ్ము అంటానన్న ఆర్కే మాటతో పాటు.. సోదరుడు జగన్ తో ఉన్న తేడాల మీద కూడా అడిగిన వైనం టీజర్ లో కనిపిస్తుంది.

సంబంధం లేదని సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్న అనటం బాధ కలిగిందన్న మాటతోపాటు.. జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అవసరమైనప్పుడల్లా.. అడిగిందల్లా శక్తికి మించి చేశానని షర్మిల చెప్పటం చూస్తే.. ఈ పూర్తి ఇంటర్వ్యూ సంచలన అంశాలతో నిండి ఉంటాయన్నది అర్థం కాక మానదు. జగన్ కు.. షర్మిలకు మధ్య విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి? దీనికి కారణం ఏమిటన్న సూటిప్రశ్న షర్మిలను అడిగినోళ్లు లేరు.. ఆమె చెప్పింది లేదు. తన ఇంటర్వ్యూల్ని స్పైసీ ప్యాక్ గా చేసే ఆర్కే.. తనకు ఏ మాత్రం పొసగని జగన్ ను ఇరుకున పెట్టే అవకాశాన్ని వదిలిపెడతారని అనుకోలేం.

అయితే.. ఏ ప్రశ్నకు.. ఎంత సమాధానం చెప్పాలన్న కొలత విషయంలో షర్మిల ఆచితూచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. బాగానే రాటుదేలావంటూ షర్మిలను ఉద్దేశించి ఆర్కే ఇచ్చిన కాంప్లిమెంట్ చూస్తే.. బోలెడన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. తాను ఎవరి బాణాన్ని కాదని.. రాజన్న బిడ్డనంటూ షర్మిల చేసిన వ్యాఖ్య.. జగన్ కు ఇబ్బందికరంగా మారుతుందన్న విషయంతో పాటు..ఇరువురి మధ్య పూడ్చలేని ఆగాధం ఉందన్న భావన కలుగక మానదు.

తెలంగాణలో సరైన ప్రత్యామ్నాయం లేదన్న మాటకు..రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. కేసీఆర్ ఆయన పిలక కాదు మెడ తీసేయగలరన్న షర్మిల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సరైన ప్రత్యామ్నాయం లేని కారణంగానే తెలంగాణలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారంటూ షర్మిల ఇస్తున్న కాన్ఫిడెంట్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ.. సామాన్యుల్లోనూ ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి టీజరుతోనే హాట్ హాట్ గా మారిన ఈ ఇంటర్వ్యూ.. ఆదివారం రాత్రి టెలికాస్టు కానుంది. మొత్తంగా ఇంటర్వ్యూ రాజకీయ సంచలనాలకు కొదవ ఉండదన్నట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.