Begin typing your search above and press return to search.

చెల్లెమ్మ టూర్‌ చేసారుగా..పోటీకి ధైర్యముందా?

By:  Tupaki Desk   |   27 Oct 2015 5:30 PM GMT
చెల్లెమ్మ టూర్‌ చేసారుగా..పోటీకి ధైర్యముందా?
X
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమిటి? దానికి ఒకటినుంచి పది లోగా రేటింగ్‌ ఇవ్వాలంటే.. మీరు ఏం చెబుతారు? ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్లను గెలుచుకున్నప్పటికీ కూడా.. ఆ బలానికి తగినంతగా అసెంబ్లీలో కనబడకుండా, కనీసం ఆ బలాన్ని కూడా నిలబెట్టుకోలేకుండా ఈసురోమనిపోయిన పార్టీ వైకాపా. అలాగని తెలంగాణలో ఆ పార్టీ అస్తిత్వం పూర్తిగా హరించుకుపోయిందని అనలేని పరిస్థితి. జగన్‌ చెల్లెమ్మ తెలంగాణ పార్టీ వ్యవహారాలకు ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న షర్మిల.. అటు పాలమూరు - రంగారెడ్డి - వరంగల్‌ జిల్లాల్లో టూర్లు నిర్వహించినప్పుడు.. ఏర్పాట్లను ఘనంగానే చేశారు. ప్రతిచోటా ఆ పార్టీకి ఎంతో కొంత కార్యకర్తల, నాయకుల బలం ఉన్నట్లుగానే కనిపించింది. అయితే ఆ బలాన్ని వచ్చే ఎన్నికల నాటికి మరింతగా పెంచుకునే పార్టీలాగా మాత్రం వారు పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వరంగల్‌ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అసలు తెలంగాణలో, చెల్లెమ్మ రెండు సార్లు టూర్‌ చేసిన వరంగల్‌ ఎంపీ స్థానం పరిధిలో వైకాపా పరిస్థితి ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా ఉంది. ఇంతకూ ఈ ఎన్నికల్లో పోటీకి దిగే ధైర్యం ఆ పార్టీకి ఉందా అని పలువురు సందేహిస్తున్నారు.

చెల్లెమ్మ వరంగల్‌ లో టూర్‌ చేసిన మాట వాస్తవమే. అక్కడ ఆమె పర్యటనలకు ఓ మోస్తరుగా జనం రావడం కూడా నిజమే. అయితే ఎన్నికల్లో పోటీ మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎంపీ స్థానానికి పోటీచేయడం పార్టీకి అవసరం అని.. కనీసం మన పార్టీ తెలంగాణలో అస్తిత్వంలోనే.. పోరట స్ఫూర్తితోనే ఉన్నట్లు అందరికీ అర్థమవుతుందని వాదిస్తున్న వారు కొందరున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గెలవడం అనేది లేదు గనుక.. పోటీచేయడం అనవసరం అని వాదించే వారు కొందరు. గెలుపు దక్కదనే ఉద్దేశంతో పోటీకి దిగకుండా ఉంటే.. కొన్నాళ్లకు పార్టీకి రూపురేఖలే మిగలవని తొలి వర్గం వాదిస్తోంది.

ఒక్క విషయం మాత్రం నిజం. వరంగల్‌ జిల్లాలోని కొందరు పార్టీ నాయకులకు .. తమకు ఎంతో కొంత వ్యాపకం, గుర్తింపు అవసరం గనుక.. ఎన్నికలకు దిగుదాం అనే కోరిక ఉండవచ్చు గానీ.. పార్టీకి అంత ధైర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్నాళ్లూ , ప్రభుత్వ నిర్ణయాల మీద పోరాటం కాదు కదా.. కనీసం కామెంట్‌ చేసిన పాపాన కూడా పోలేదు. మరి అంత అచేతనావస్థ నుంచి ఒకేసారిగా ఎన్నికల్లోకి దిగేంత సాహసం వైకాపా చేస్తుందని ఎవ్వరూ భావించడం లేదు.