Begin typing your search above and press return to search.

షర్మిల పార్టీ ప్రకటన.. ఎక్కడ? ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   3 July 2021 5:17 AM GMT
షర్మిల పార్టీ ప్రకటన.. ఎక్కడ? ఎప్పుడంటే?
X
అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. షర్మిల పార్టీ ప్రకటనకు వేళైంది. ఎప్పుడు? ఎక్కడ చేస్తున్నారనే విషయం తేటతెల్లమైంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొస్తున్నారు. ఈ జులైలోనే పార్టీని ప్రారంభించనున్నారు. తన అదృష్ట్యాన్ని తెలంగాణ రాజకీయాల్లో పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే పార్టీ పేరు, గుర్తింపు, రంగులు అన్నీ ఖాయం అయ్యాయి.

ఇక జులై 8న హైదరాబాద్ లోనే ఘనంగా పార్టీని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీని ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సుమారు 1000 మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి తెలంగాణ వ్యాప్తంగా లక్షమందిని సమీకరించాలని.. పార్టీని ఘనంగా ప్రకటించాలని యోచిస్తున్నారు.ఇక అచ్చం వైసీపీ రంగులను పోలి ఉండేలానే నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులను షర్మిల పార్టీ కలిగి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జగన్ పార్టీతో సమానంగా ఉంటుందని తేలిపోయింది.ఇక వైసీపీలాగానే షర్మిల పార్టీ ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిసింది.

జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణలో పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లోని ప్రజలను ప్రధానంగా తరలించి తన బలాన్ని ప్రదర్శించనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలతో ఇంతమందితో సభకు షర్మిలకు పోలీసులు అనుమతిస్తారా? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.

మహమ్మారి పరిస్థితిని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలకు ఆస్కారం లేకుండా ఉంది. కాబట్టి షర్మిల బృందం జూబ్లీహిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో 1000 మందితో పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు.

జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ సినిమా వేడుకలు, ప్రముఖుల వివాహాలకు ప్రసిద్ధి గాంచింది. ఇది ఇప్పటివరకు రాజకీయ సమావేశాలకు, సభలకు ఉపయోగించలేదు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల నుంచి వెయ్యి మంది కీలక పార్టీ నాయకులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. అనుమతిస్తే లక్షమందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతానికి తెలంగాణలో ఎటువంటి కరోనా లాక్ డౌన్ ఆంక్షలు లేవు. పరిమితులు పెట్టలేదు. షర్మిల తన పార్టీ ప్రణాళికలను ఈ సభలోనే చెబుతారట.. సినిమాటిక్ స్టైల్లో ఈ సభ షర్మిల ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ఎంట్రీ కూడా సినిమా స్టైల్లోనే ఉండబోతోందని.. విమర్శలకు అవకాశం లేకుండా పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు.