Begin typing your search above and press return to search.

జగనన్నా! చెల్లెమ్మ నెవరూ పట్టించుకోవట్లే...!

By:  Tupaki Desk   |   11 Sep 2015 6:18 AM GMT
జగనన్నా! చెల్లెమ్మ నెవరూ పట్టించుకోవట్లే...!
X
జగన్మోహనరెడ్డి తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్రలను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారనే సంగతి ఆయన సొంత పార్టీలోనే పలువురు నాయకులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. గతంలో షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించినప్పటి పరిస్థితులు వేరు. ప్రతిచోటా ఆమెకు బ్రహ్మరథం పట్టి నీరాజనాలు పలికారు. రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత.. షర్మిలను వ్యూహాత్మకంగా తెలంగాణకు పరిమితం చేశారు జగన్‌. వైఎస్‌ జయంతి, వర్ధంతి సందర్భాల్లో ఇడుపులపాయలో తప్ప.. షర్మిల ఏపీ పరిధిలో ఎలాంటి ప్రజా కార్యక్రమంలోనూ ఇప్పటిదాకా పాల్గొనలేదన్నది నిజం. అలా ఆమెను లైన్ తప్పించారు.

పోనీ ఆమెకు అప్పగించిన తెలంగాణలో పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా.. అంటే.. అదీ లేదు. ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో పర్యటన సందర్భంగా అయితే కొన్ని చోట్ల షర్మిల యాత్ర గురించి పట్టించుకుంటున్న వారే కనిపించడం లేదు. చాలా పేలవంగా యాత్ర సాగుతోంది. రంగారెడ్డి పాలమూరు జిలాల్లో పర్యటించినప్పుడు పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. యాత్రలు మొదలుపెట్టిన రోజుల్లో తెలంగాణ వైకాపా నాయకులు కాస్త సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని అంతో ఇంతో భారీగా నిర్వహించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత క్రమంగా ప్రాభవం తగ్గింది. ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో ఇది రెండో సారి సాగుతున్న పర్యటన! ఇదివరకటికి ఇప్పటికి ప్రజాదరణలో బాగా తేడా కనిపిస్తోంది. పైగా తెలంగాణలో ఎలాంటి ఉనికి లేని వైకాపా, ఇలాంటి పేలవమైన షర్మిల యాత్రల వల్ల ఏ కొంచెమైనా బలం పుంజుకోవడం సాధ్యమేనా అనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.

అయితే వైసీపీ ప్రత్యర్థులు మరో వాదన వినిపిస్తున్నారు. తెలంగాణలో బలం పుంజుకోవడం అనేది వైకాపా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదని.. ఇక్కడ తెరాసకు వ్యతిరేకంగా ఉండే ఓటును చీల్చగలిగితే చాలుననే ఉద్దేశంతోనే పనిచేస్తున్నదని అంటున్నారు. అసలే తెరాస అధినేత కేసీర్‌ తో , జగన్‌ కుమ్మక్కు అయి పనిచేస్తున్నారని తెదేపా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ వాదనలకు బలం చేకూర్చేలాగానే .. ఈ పుకార్లు ఉన్నాయి. తెరాస వ్యతిరేక ఓటు చీలిస్తే.. కేసీఆర్‌ కు లాభం కదా అని అనుకుంటున్నారు. మరి దానికోసం ఇంతా యాత్రల రూపేణా కష్టపడుతున్న షర్మిలకు ఈ కష్టానికి ఫలితం ఏం దక్కేటట్టు! అనేది కొందరిలో వ్యక్తం అవుతున్న అనుమానం.