Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ బరి నుంచి తప్పుకున్న షర్మిల.. కారణం ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   16 July 2021 2:21 PM GMT
హుజూరాబాద్ బరి నుంచి తప్పుకున్న షర్మిల.. కారణం ఏంటో తెలుసా?
X
రాజకీయం మొద‌టి టార్గెట్‌.. అంతిమ ల‌క్ష్యం ఒక్క‌టే. అధికారం సాధించ‌డం. అది ద‌క్కాలంటే.. ఎన్నిక‌ల్లో గెలుపే మార్గం. ఎన్నిక‌ల ఫ‌లితాల‌తోనే ఆ పార్టీ బ‌లం, బ‌ల‌హీన‌త ఏంట‌న్న‌ది తేలిపోతుంది. అలాంటి కీల‌క మైన సంద‌ర్భంగా ఇప్పుడు ష‌ర్మిల ముందుకు వ‌చ్చింది. ఆమె పార్టీ ప్ర‌క‌టించిన వెంట‌నే హుజూరాబాద్‌ ఎన్నిక‌ల స‌మ‌రం ఆరంభం కాబోతోంది. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేయ‌ట్లేద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. దీనికి కార‌ణం ఏంట‌న్న‌ది కూడా చెప్పారు.

హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీల‌క‌మైన‌ది. రాష్ట్ర రాజ‌కీయాలను మార్చే కీల‌క‌మైన ఎల‌క్ష‌న్ కాబోతోంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్ వెంట ఉన్న ఈట‌ల రాజేంద‌ర్.. ఇప్పుడు కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని స‌వాల్ చేస్తున్నారు. బీజేపీలో చేరిన ఆయ‌న‌.. ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ద్వారా తెలంగాణ రాష్ట్ర స‌మితి ప‌ని అయిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దే అని చాటిచెప్పాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటు కేసీఆర్ కూడా సీరియ‌స్ గా ఉన్నారు. ద‌శాబ్దాల పాటు హుజూరాబాద్ లో పాతుకుపోయిన ఈట‌ల‌ను ఎదుర్కోవ‌డం అంత ఈజీ కాక‌పోవ‌డంతో.. వ్యూహాల మీద వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోతే విప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌న్న సంగ‌తి ముఖ్య‌మంత్రికి తెలియ‌నిది కాదు. అందుకే.. ఆరు నూరైనా ఈ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌ని చూస్తున్నారు. దీంతో.. ఏం జ‌రగ‌నుంద‌ని రాష్ట్రం మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఫోక‌స్ పెట్టింది.

ఇంత కీల‌క‌మైన ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ పోటీ చేయ‌బోద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం నిర్వ‌హించిన మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో పాల్గొన‌ట్లేద‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ను ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య పోరాటంగా అభివ‌ర్ణించారు. ఇద్ద‌రు వ్య‌క్తుల‌ ప్ర‌తీకార రాజ‌కీయాల్లో తాము భాగం కావాల‌ని అనుకోవ‌ట్ల‌ద‌ని చెప్పుకొచ్చారు ష‌ర్మిల‌. ఈ ఎన్నిక‌లో ఎవ‌రు గెలిచినా, ఓడినా ప్ర‌జ‌ల‌కు ఒరిగేది ఏమీ లేద‌ని అన్నారు. యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించే మేనిఫెస్టోతో పార్టీలు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగితే.. తాము కూడా హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ష‌ర్మిల చెప్పారు.

ఈ నిర్ణ‌యంపై రాజ‌కీయ వ్యాఖ్యానాలు విశ్లేష‌ణ‌లు ప‌లు ర‌కాలుగా సాగుతున్నాయి. ష‌ర్మిల‌ పార్టీ ఇప్పుడే ప్రారంభ‌మైంది కాబ‌ట్టి.. అప్పుడే ఎన్నిక‌ల్లోకి దిగితే ఎదురు దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంద‌ని భావించి.. బ‌రిలోకి దిగ‌డం లేద‌ని కొంద‌రు చెబుతున్నారు. అక్క‌డ పార్టీల ప్రాతిప‌దిక‌న కాకుండా.. ఈట‌ల‌-కేసీర్ మ‌ధ్య పోరుగా మారిపోవ‌డం కూడా మ‌రో కార‌ణ‌మ‌ని అంటున్నారు. అదేవిధంగా.. ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌టించి కొన్ని రోజులు మాత్ర‌మే. ఇంకా.. ఆ పార్టీ జిల్లా క‌మిటీలు కూడా నియ‌మించ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాల వారీగా కూడా పార్టీ ఇంకా కుదురుకోలేదు. ఈ కార‌ణంగానే ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నార‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

లేదంటే.. ష‌ర్మిల వ్యూహ‌క‌ర్త సూచ‌న కూడా అయి ఉండొచ్చ‌ని అంటున్నారు. దేశంలోనే దిగ్గ‌జ వ్యూహ‌క‌ర్త‌గా పేరుగాంచిన ప్ర‌శాంత్ కిషోర్.. శిష్యురాలిని ష‌ర్మిల‌ వ్యూహ‌క‌ర్త‌గా తీసుకున్నార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఆ వ్యూహ‌క‌ర్త పేరు ప్రియ‌. త‌మిళ‌నాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్ర‌న్ కుమార్తె. ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ లో గ‌తంలో వ‌ర్క్ చేసింద‌ని చెబుతున్నారు. త‌మిళ‌నాట ఓ మీడియాను కూడా న‌డుపుతున్న ఈమె.. ష‌ర్మిల విజ‌యానికి సంబంధించిన‌ వ్యూహాలు ర‌చించ‌బోతోంద‌ట‌. ప్రియ‌ను నిజంగానే ష‌ర్మిల వ్యూహ క‌ర్త‌గా సెల‌క్ట్ చేసుకున్నారా? అన్న‌ది అఫీషియ‌ల్ గా తేలాల్సి ఉంది. మొత్తానికి స‌ల‌హా ఎవ‌రిదైనా ష‌ర్మిల మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రి, ష‌ర్మిల పాల్గొన‌బోయే మొద‌టి ఎన్నిక‌లు ఏవీ అన్న‌ది చూడాలి.