Begin typing your search above and press return to search.

షర్మిల స్టీరింగ్ ఏపీ వైపు... ఏం జరగనుంది... ?

By:  Tupaki Desk   |   27 Dec 2021 2:30 PM GMT
షర్మిల స్టీరింగ్ ఏపీ వైపు... ఏం జరగనుంది... ?
X
వైఎస్ జగన్ ఏపీ సీఎం గా ఉంటున్నారు. ఆయన ఇప్పటికే సగం పాలన పూర్తి చేసారు. అదే సమయంలో మరో టెర్మ్ కూడా అధికారంలోకి రావడానికి తెర వెనక పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఏపీలో అయితే వైసీపీకి ప్రధాన పోటీ టీడీపీ నుంచే అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వర్సెస్ జగన్ గా ఏపీ ఎన్నికలు మరో సారి జరగనున్నాయి.

అయితే ఏపీలో కొత్త రాజకీయ శక్తులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం ఈ రెండు పార్టీల మధ్యనే అధికార సమరాన్ని కేంద్రీకృతం చేయకుండా మూడవ శక్తి కనుక వస్తే కచ్చితంగా మార్పు ఉంటుందని కూడా ఆశించిన వారూ ఉన్నారు.

ఆ విధంగా కాపుల పేరిట ఒక పార్టీకి సన్నాహాలు జరుగుతున్నాట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ వదిలిన బాణంగా ఏపీ రాజకీయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న వైఎస్సార్ ముద్దుల తనయ, జగన్ సొంత చెల్లెలు అయిన షర్మిల ఈ కీలక సమయాన ఏపీలో ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. వైఎస్ షర్మిల అయితే తన పార్టీని తెలంగాణాలోనే కొనసాగిస్తున్నారు. దానికి వైఎస్సార్ టీపీ అని పేరు పెట్టారు.

అయితే అక్కడ ఆశించిన స్పందన అయితే జనాల నుంచి రావడంలేదు, ఆమె ఆంధ్రా మూలాలు, జగన్, వైఎస్సార్ ల ప్రభావం కూడా పార్టీ మీద తీవ్రంగా పడుతున్నాయి. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల నాటికి షర్మిల ఏపీలో కూడా ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

షర్మిలకు ఏపీలో విశేష ఆదరణ ఉందని, ఆమె కనుక పాదయాత్రలు ఏపీలో చేస్తే జనాలు విరగబడేలా వస్తారని కూడా రాజు గారు జోస్యం చెబుతున్నారు. ఇక ఏపీలో వైసీపీ తాను చెప్పిన అనేక హామీలను పట్టించుకోలేదని, వాటిని పూర్తిగా గాలికి వదిలేసిందని కూడా రాజు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకనాడు జగన్ వెంట ఉండి ఆ పార్టీని గెలిపించిన షర్మిల కొత్త పార్టీతో ఏపీలో ఆరగేంట్రం చేస్తే దాని ప్రభావం కచ్చితంగా వైసీపీ మీదనే ఉంటుందని అంటున్నారు.

మరి షర్మిలలో కూడా ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయా అన్నదే ఇక్కడ చూడాలి. ఆమె తనకు సరైన రాజకీయ క్షేత్రం ఏపీ అన్నది కనుక అనుకుంటే కచ్చితంగా ఏపీలో రాజకీయ పరిణామాలు మారడం ఖాయమనే అంటున్నారు. అదే టైమ్ లో ఏపీలో వైసీపీలోనే రాజకీయ ప్రకంపనలు చెలరేగడం ఖాయమని కూడా అంటున్నారు. మొత్తానికి రఘురామ క్రిష్ణం రాజు చెప్పినది జరుగుతుందా. చూడాలి.