Begin typing your search above and press return to search.

సాక్షికి షాకిచ్చిన షర్మిల.. మాటలకు.. చేతలకు పొంతన లేదుగా?

By:  Tupaki Desk   |   20 Oct 2021 10:30 AM GMT
సాక్షికి షాకిచ్చిన షర్మిల.. మాటలకు.. చేతలకు పొంతన లేదుగా?
X
తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో వైఎస్ షర్మిల పాదయాత్రను ఈ రోజు నుంచి షురూ చేయటం తెలిసిందే. సుదీర్ఘంగా సాగనున్న ఆమె పాదయాత్ర నేపథ్యంలో ఆమె.. ఆంధ్రజ్యోతికి తప్పించి మరే పత్రికకు యాడ్ ఇవ్వకపోవటం గమనార్హం. తన సోదరుడితో తనకు ఎలాంటి పంచాయితీ లేదని.. ఆయన దగ్గరి వారు అన్న మాటలకు మనసు కష్టపడినట్లుగా ఆమె వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ మధ్యనే ఒక మీడియా అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆచితూచి అన్నట్లు మాట్లాడారు.

తన సోదరుడు జగన్ మీద కించిత్ మాట అనలేదు. ఏదైనా మసాలా దొరుకుతుందన్న ప్రయత్నం సదరు మీడియా అధినేత చేసినా.. ఆయన ఎత్తులు పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తనకు.. తన సోదరుడికి ఏమీ లేదని.. అంతా బాగుందన్న మాటను ఆమె చెప్పటం తెలిసిందే. తన తండ్రి జయంతి రోజున ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామని.. టిఫిన్ కూడా చేశామని చెప్పారు.

అంతా బాగున్నప్పుడు.. తన సోదరుడికి చెందిన మీడియా సంస్థలో (ఆమెకు కూడా భాగం ఉందన్న వాదన కొత్తగా తెర మీదకు వచ్చిందనుకోండి) యాడ్ రాకపోవటం విశేషం. అదే సమయంలో.. ఈ మధ్యన తన ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేసిన మీడియా సంస్థకు భారీ జాకెట్ యాడ్ ఇవ్వటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు.. షర్మిల పెదాలు చెప్పే మాటలకు.. ఆమె చేతలకు ఏ మాత్రం సంబంధం లేదనే విషయం మరోసారి స్పష్టమైందన్న మాట వినిపిస్తోంది.