Begin typing your search above and press return to search.

నయా రాజకీయం: అన్న జగన్ ను వదలని షర్మిల

By:  Tupaki Desk   |   6 Aug 2021 4:16 AM GMT
నయా రాజకీయం: అన్న జగన్ ను వదలని షర్మిల
X
రాజకీయం తోడబుట్టిన వారి మధ్య కూడా చిచ్చు పెడుతోంది. చిన్నప్పటి ఆప్యాయత అనురాగాలతో పెరిగి పెద్దవారైన ఆ ఇద్దరు ఇప్పుడు చెరో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరేమో ఏపీ సీఎంగా ఉండగా.. మరొకరు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ముందుకెళుతున్నారు. తమ తమ రాష్ట్రాలు, రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు తోబుట్టువులు కూడా విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళుతున్నారు. అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలను వదలడం లేదు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల కల్పనపై దీక్షలు, ఆందోళనలు చేస్తూ అధికార పార్టీ కంట్లో నలుసులా మారాయి.

అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాలను తెరపైకి తీసుకొచ్చారు. ఆంధ్రా ఆడకూతురు అయిన షర్మిల ఈ విషయంలో ఇరుకునపడిపోయారు. స్పందించాల్సిన పరిస్థితి రావడంతో తెలంగాణకే జై కొట్టారు.ఇక్కడి కోడలుగా.. ‘ఏపీకి ఒక్క చుక్క నీటిని’ వదులుకోం అని స్పష్టం చేశారు. మనసులో ఎంత ఆంధ్రా అభిమానం ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో రాజకీయం కోసం షర్మిల కూడా ఇటువైపు మొగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

తాజాగా షర్మిల స్థాపించిన ‘వైఎస్ఆర్ టీపీ’ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం, అన్న జగన్ కు షర్మిల పరోక్షంగా చురకలు అంటించడం విశేషం. ‘తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులను గాలికి వదిలేశారని’ ఆమె ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఉన్న వారిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్న జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

వైఎస్ కుటుంబం కోసం అభిమానులు, కార్యకర్తలు చాలా చేశారని.. సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారని షర్మిల తెలిపారు. చాలా మంది అభిమానులకు ఇప్పటికీ గుర్తింపు దక్కలేదన్నారు.

ఇన్నాళ్లు రాష్ట్ర సమస్యలపై గళం ఎత్తిన షర్మిల తాజాగా తన కుటుంబ అంతర్గత సమస్యను తెరపైకి తీసుకొచ్చి సొంత అన్న జగన్ పైనే విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది.