Begin typing your search above and press return to search.

హోదా ఇన్‌స్టెంట్‌ గా ఎలా వ‌స్తుందో చెప్పాడు

By:  Tupaki Desk   |   5 Jun 2017 5:08 AM GMT
హోదా ఇన్‌స్టెంట్‌ గా ఎలా వ‌స్తుందో చెప్పాడు
X
ఏపీ రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు.. త‌ర్వాత కూడా పెద్ద‌గా ప‌ట్ట‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ క‌న్ను ప‌డింది. త‌మ‌కు ప‌వ‌ర్‌ను అందించే అదృష్ట ఆంధ్ర‌ప్ర‌దేశ్ తోడుగా నిల‌వ‌క‌పోతే.. తమ‌కెంత న‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని కాంగ్రెస్ గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అందుకే కాబోలు గ‌తానికి భిన్నంగా ఏపీకి హోదా విష‌యంలో తాము ఒక్క‌ర‌మే హామీ ఇస్తే ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. త‌మ మిత్రులంద‌రితో ఏపీ హోదా విష‌యాన్ని చ‌ర్చించి.. వారిని ఒప్పించిన త‌ర్వాత క‌ద‌న‌రంగంలోకి దూకిన‌ట్లుగా కాంగ్రెస్ తీరు ఉన్న‌ట్లుగా ఉంది. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన స‌భ‌లో.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో తామంతా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నామ‌న్న విష‌యాన్ని వివిధ పార్టీల‌కు చెందిన నేతలు చెప్ప‌టం చూస్తే.. ఏపీ హోదా మీద కాంగ్రెస్ సీరియ‌స్ గా ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

అయితే.. విభ‌జ‌న‌తో ఆంధ్రోళ్ల‌కు చేసిన ద్రోహం ముందు.. ఈ ప్ర‌య‌త్నం పెద్ద‌గా ఆక‌ర్షించ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ విష‌యం మీద కాంగ్రెస్‌ కు సైతం క్లారిటీ ఉంద‌న్నట్లుగా నిన్న స‌భ‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకోవ‌టానికి.. హోదా ఆశ‌ల్ని స‌జీవంగా నిల‌ప‌టానికి.. మోడీ స‌ర్కారు మీద ఒత్తిడిని పెంచే దిశ‌గా వారి మాట‌లు ఉండటం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. ఏపీకి హోదా తీసుకురావ‌టం చాలా తేలిక అంటూ జేడీయూ నేత శ‌ర‌ద్‌ యాద‌వ్ చెప్పిన ఐడియా విన్న‌ప్పుడు నిజ‌మే క‌దా అనిపిస్తుంది. అయితే.. ప‌రిమితుల మ‌ధ్య‌.. ఆయ‌న మాట ఆచ‌ర‌ణ‌లో అసాధ్య‌మ‌నిపించ‌క మాన‌దు. ఏపీకి హోదాను ఇన్ స్టెంట్‌ గా తీసుకొచ్చే అవ‌కాశం ఉందంటూ.. రానున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ ఒకే మాట మీద నిల‌బ‌డితే.. ప్ర‌ధాని మోడీ రెండో రోజే ఏపీకి వ‌చ్చి హోదా గురించి ప్ర‌క‌ట‌న చేసి వెళ‌తార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల మీద చిత్త‌శుద్ధి ఉంటే చంద్ర‌బాబు.. జ‌గ‌న్ లు ఇద్ద‌రూ ఏన్డీయే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌ద‌న్నారు. శ‌ర‌ద్ యాద‌వ్ మాట‌లు విన్నంత‌నే నిజ‌మే అనిపించినా..ప్రాక్టిక‌ల్ గా ఆలోచించిన‌ప్పుడు ఏ మాత్రం సాధ్యం కాద‌న్న విష‌యం కూడా అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/