Begin typing your search above and press return to search.

భారీ నిర్ణ‌యం: ఇద్ద‌రు ఎంపీల‌పై వేటు ప‌డింది

By:  Tupaki Desk   |   5 Dec 2017 4:09 AM GMT
భారీ నిర్ణ‌యం: ఇద్ద‌రు ఎంపీల‌పై వేటు ప‌డింది
X
బిగ్ బ్రేకింగ్ గా చెప్పాలి. గ‌డిచిన కొంత‌కాలంగా బిహార్ అధికార‌ప‌క్షంలో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త విభేదాలు ఇప్పుడు తీవ్ర‌స్థాయికి చేరుకోవ‌ట‌మే కాదు.. ఏకంగా అన‌ర్హ‌త వేటు వేసే వ‌ర‌కూ వెళ్లింది. జాతీయ స్థాయి నేత‌గా సుప‌రిచితుడైన ఎంపీపై వేటు వేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఉప రాష్ట్రప‌తి హోదాలో ఉన్న వెంక‌య్య నాయుడు జారీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

బిహార్ లో జేడీయూకు చెందిన శ‌ర‌ద్ యాద‌వ్‌.. అలీ అన్వ‌ర్ లు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల్లో పాల్గొంటున్నార‌ని.. త‌మ‌కు న్యాయం చేయాలంటూ రాష్ట్ర సీఎం నితీశ్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ను ఆశ్ర‌యించారు. దీనిపై విచారించిన క‌మిష‌న్‌.. నితీశ్ దే అస‌లైన జేడీయూగా తేల్చింది. అదే స‌మ‌యంలో శ‌ర‌ద్ యాద‌వ్‌ ను ఎంపీగా అన‌ర్హ‌త వేటు వేస్తూ ప్ర‌క‌టించింది.

ఆ మ‌ధ్య‌న బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టం.. జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ కాంబినేష‌న్లో ఏర్పాటు చేసిన కూట‌మి విజయం సాధించ‌టం తెలిసిందే. ఈ కూట‌మితో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్‌. త‌ర్వాతి కాలంలో ఆర్జేడీ నుంచి వ‌స్తున్న రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ఇలాంటి టైం కోస‌మే ఎదురు చూస్తున్న నితీశ్ ను బీజేపీ ద‌గ్గ‌ర తీయ‌టం.. అనూహ్య ప‌రిణామాల‌తో జేడీయూ రెండు ముక్క‌లుగా చీలిపోయి.. నితీశ్ నేతృత్వంలో బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ప‌రిణామంపై ఆర్జేడీ అధినేత లాలూ.. జేడీయూకి చెందిన శ‌ర‌ద్ యాద‌వ్‌.. మరికొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేకించారు. త‌మ‌దే అస‌లుసిస‌లు జేడీయూగా పేర్కొంటూ ర్యాలీలు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో నితీశ్ ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించారు. త‌మ‌దే అస‌లైన జేడీయూగా గుర్తించాల‌ని కోర‌టంతో పాటు.. శ‌ర‌ద్ యాద‌వ్‌.. అలీ అన్వ‌ర్ లు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. వారిపై వేటు వేయాల‌ని కోరారు.

నితీశ్ ఫిర్యాదు మేర‌కు విచార‌ణ జ‌రిపిన ఎన్నిక‌ల సంఘం శ‌ర‌ద్ యాద‌వ్‌.. అలీల‌పై అన‌ర్హ‌త వేటు వేసింది. నితీశ్ వ‌ర్గానిదే అస‌లైన జేడీయూగా గుర్తించింది. ఈ నేప‌థ్యంలో ఎంపీలు శ‌ర‌ద్ యాద‌వ్‌.. అలీ అన్వ‌ర్ ల‌ను అన‌ర్హులుగా పేర్కొంటూ రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌.. ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు నిర్ణ‌యం తీసుకున్నారు. తాజా నిర్ణ‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.