Begin typing your search above and press return to search.

ఏపీ మూడు రాజధానులపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 April 2022 2:57 AM GMT
ఏపీ మూడు రాజధానులపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
X
ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయటం.. తాను అధికారంలోకి వస్తే అమరావతి కాకుంటే మరో రాజధానిని ఏర్పాటు చేస్తానన్న సందేహం వద్దని.. తనకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన జగన్.. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేశారు? మరేం చేస్తున్నారు? అన్న విషయం తెలిసిందే.

రాజధాని విషయంలో తాను చెప్పిన మాటలకు భిన్నంగా మూడు రాజధానుల దిశగా అడుగులు వేయటం.. దీనిపై తీవ్రవ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసిందే. అయితే.. మూడు రాజధానుల అంశంపై వస్తున్న వ్యతిరేకత మొత్తం పెయిడ్ ఆర్టిస్టులదే తప్పించి.. వాస్తవం కాదన్న ప్రచారాన్ని ఆయన ప్రభుత్వం చేస్తోంది. ఏపీ మూడు రాజధానులపై ఇటీవల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మూడు రాజధానుల అంశంపై వివిధ రాష్ట్రాలకు చెందిన దిగ్గజ నేతలు ఏమనుకుంటున్నారు? అన్న దానిపై క్లారిటీ లేదు. ఈ విషయంపై తాజాగా స్పష్టత వచ్చిందని చెప్పాలి. అమరావతి రైతులు.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరితో కలిసి.. మహారాష్ట్రలోని అధికార భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి వివరించారు.ఈ సందర్భంగా శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మహారాష్ట్రలోనూ రెండు రాజధానులు ఉన్నాయని.. వాటిల్లో ఒకటి ముంబయి అయితే.. మరొకటి విదర్భ. కానీ.. విదర్భ ప్రాంతంలో ఎలాంటి డెవలప్ మెంట్ జరగలేదన్నారు. అలాంటి పరిస్థితి మహారాష్ట్రలో ఉంటే.. తమ రాష్ట్రం కంటే చిన్నదైన ఏపీలో మూడు రాజధానుల అవసరం ఏమిటన్న సూటి ప్రశ్నను సంధించారు. ఈ వ్యాఖ్య కచ్ఛితంగా ఏపీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బేనని చెప్పక తప్పదు. ఎందుకంటే.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయం ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేదన్న మాట తాజాగా తేలినట్లేనని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాము 841 రోజులుగా ఉద్యమం చేస్తున్నా పట్టించుకోవటం లేదని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఉద్యమం సాగుతుంటే సీఎం పట్టించుకోవటం లేదా? అని పవార్ ప్రశ్నించి ఆశ్చర్యానికి గురైనట్లు చెబుతున్నారు. ఉద్యమానికి సానుకూలంగా స్పందించకపోవటమే కాదు.. అసభ్య పదజాలంతో దూషణలు చేయిస్తూ.. పోలీసులతో లాఠీ ఛార్జీ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి ప్రతిపక్షాలు అసెంబ్లీ లో దీని గురించి మాట్లాడటం లేదా? అని ప్రశ్నించగా.. విపక్షాల్ని నోరెత్తనివ్వటం లేదన్నారు.

అమరావతి నిర్మాణం గురించి తనకు చంద్రబాబు తన ప్రణాళికను చెప్పారని.. అదెంతో అద్భుతంగా ఉందని గతంలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కొత్త రాజధాని ప్రణాళిక చాలా బాగుందని.. 30వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించటం మామూలు విషయం కాదన్నారు. వేలాది కోట్ల రూపాయిలతో పనులు చేపట్టిన తర్వాత రాజధాని మార్పు చేయాలనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుందన్న పవార్ వ్యాఖ్యలు జగన్ సర్కారుకు జాతీయ స్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి.. దీనిపై ఏపీ అధికారపక్ష నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.