Begin typing your search above and press return to search.

టాటాలకు షాపూర్ జీ పల్లోంజీ షాక్.. 1.75 లక్షల కోట్లు ఇవ్వాలి

By:  Tupaki Desk   |   30 Oct 2020 12:20 PM IST
టాటాలకు షాపూర్ జీ పల్లోంజీ షాక్.. 1.75 లక్షల కోట్లు ఇవ్వాలి
X
టాటా గ్రూప్ తో 70 ఏళ్లకు పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకునేందుకు సైరస్ మిస్త్రీ సారథ్యంలోని షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు (ఎస్.పీ.జీ) సిద్ధమైంది. ఈ మేరకు విభజన ప్రణాళికను సుప్రీం కోర్టుకు సమర్పించింది.

టాటాసన్స్ రెండు గ్రూపులున్న కంపెనీ. ఇందులో టాటాలకు 81.6శాతం వాటా ఉంది. 18.37శాతం వాటా ఉన్న సైరస్ మిస్త్రీ కుటుంబం మరొకటి. ఈ క్రమంలోనే తమ వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లుగా షాపూర్ జీ పల్లోంజీ లెక్కకట్టింది. సంస్థ విభజన పథకంలో భాగంగా ఆ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఇక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ లోనూ టాటా సన్స్ కు 72శాతం వాటా ఉంది. ఈ క్రమంలో టాటాసన్స్ లో వాటా ఉన్న షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ ఇందులోనూ వాటా కోరుతోంది. ఈ లెక్కన టీసీఎస్ లో షాపూర్ జీ పల్లోంజీకి 13.22శాతం వాటా లభిస్తుంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ విలువ రూ.1.35 లక్షల కోట్లు.

షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు తమ వాటాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. టాటాలు కూడా కొనుగోలుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

2016 అక్టోబర్ 28న టాటా చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీని ఆ పదవి నుంచి తొలగించడంతో ఈ రెండు గ్రూపుల మధ్య న్యాయపోరాటం మొదలైంది. గ్రూపులోని వాటాల విలువ లెక్కతేల్చి చెల్లించాలని సైరస్ మిస్త్రీ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం కోర్టుకు ఎక్కారు.