Begin typing your search above and press return to search.

గులాబీ గూటిలో త్యాగాల శంకరమ్మ ఒంటరి

By:  Tupaki Desk   |   21 Sept 2019 11:14 AM IST
గులాబీ గూటిలో త్యాగాల శంకరమ్మ ఒంటరి
X
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఇప్పుడు ఒంటరి అయిపోయారు. హైదరాబాద్ లోని ఎల్.బి నగర్ చౌరస్తాలో తెలంగాణ కోసం శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకొని ఆత్మత్యాగం చేశారు. ఈయన చావుతోనే తెలంగాణ కదిలింది.. ఢిల్లీ మెడలు వంచింది.. తెలంగాణ సాధించింది.

అంతటి గొప్ప ఉద్యమకారుడి తల్లికి టీఆర్ ఎస్ లో ఆది నుంచి ప్రాధాన్యత లేనే లేదన్నది ఉద్యమకారుల ఆరోపణ.. పీసీసీ చీఫ్ గా ఉన్న బలమైన ఉత్తమ్ పై 2014లో శంకరమ్మను పోటీచేయించారు. కనీసం ఆమెకు టీఆర్ ఎస్ పార్టీ ఆర్థిక అండదండలు కూడా అందించలేదన్న విమర్శలున్నాయి. అక్కడ ఆమె గెలవదని తెలిసి ఆ సీటు ఇచ్చారన్న విమర్శలున్నాయి. పోనీ ఓడిపోయాక కనీసం ఎమ్మెల్సీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు.

సరే అని గులాబీ పార్టీలోనే ఉన్న ఆమెకు 2019లో అసలు హుజూర్ నగర్ టికెట్ కూడా దక్కలేదు. ఇప్పుడు ఉత్తమ్ ఎంపీగా గెలిచి రాజీనామా చేయడంతో మళ్లీ ఉప ఎన్నిక వచ్చింది. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని శంకరమ్మ వేడుకుంటున్నా టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఉత్తమ్ పై ఓడిన అభ్యర్థిని లేదా కవితను బరిలోకి దింపుతారన్న ఊహాగానాలు ఉన్నాయి.

అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే అభ్యర్థిగా ఉత్తమ్ భార్య పద్మావతిని ప్రకటించేశాయి. దీంతో శంకరమ్మ ఒంటరిగా హుజూర్ నగర్ లో బరిలోకి దిగేందుకు రెడీ అయ్యింది. అన్ని పార్టీలు పోటీ పెట్టకుండా తనకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన ఉద్యమకారుడి తల్లిపై పోటీ ఎవరూ చేయవద్దంటూ వేడుకుంటోంది.

కానీ ఈ ప్రతిష్టాత్మక సీటు కోసం కాంగ్రెస్ - టీఆర్ ఎస్ నువ్వానేనా అన్నట్లుగా రాజకీయం నడుపుతున్నాయి. ఇలా తెలంగాణ అమరులను - వారి కుటుంబాలను ఆదుకోవాలని మైకుల ముందు చెప్పే కాంగ్రెస్ కానీ.. ఇక ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ కానీ ‘త్యాగాల శంకరమ్మ’ను కనీసం పట్టించుకోకుండా ఉండడం గమనార్హం. త్యాగాలకు వారు కావాలి కానీ అధికారానికి మాత్రం వద్దనేలానే తెలంగాణ పార్టీల రాజకీయాలున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ..