Begin typing your search above and press return to search.

రక్తం కారుతున్నా 80 బాదాడట!

By:  Tupaki Desk   |   14 May 2019 10:25 AM IST
రక్తం కారుతున్నా 80 బాదాడట!
X
ఐపీఎల్ ఫైనల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ పోరాట పటిమను అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాలని - జట్టుకు మరోసారి ట్రోఫీని అందించాలని చేసిన ప్రయత్నం విఫలమైనా అతడి ఆటతీరు మాత్రం ప్రశంసలు అందుకుంది. 59 బంతుల్లో 8 ఫోర్లు నాలుగు సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టును విజయం వైపుగా నడిపించినప్పటికీ చివర్లో వికెట్లను వెంటవెంటనే చేజార్చుకోవడతో ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ముంబై విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోపీని ఎగరేసుకుపోయింది.

అద్బుత ఆటతీరుతో ఆకట్టుకున్న వాట్సన్‌కు సంబంధించి మరో ఆశ్చర్యపోయే - విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసి చెన్నై జట్టు ఫ్రాంచైజీనే కాదు... అభిమానులు సైతం అతడిపై మరింత అభిమానాన్ని పెంచేసుకున్నారు. ఫీల్డింగ్‌ లో డైవ్ చేస్తున్నప్పుడు వాట్సన్ మోకాలికి గాయమైందట. గాయం బాధిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచుకున్నాడట. ఆ తర్వాత గాయం ఎవరికీ కనిపించకుండా ప్యాడ్స్ కట్టుకుని బ్యాటింగ్‌ కు దిగాడట. బాధను పంటికింద భరిస్తూనే 80 పరుగులు చేశాడు. ఆ సయయంలో మోకాలి నుంచి రక్తం కారుతున్నప్పటికీ జట్టుకు విజయాన్ని అందించడమే ధ్యేయంగా ఫోర్లు - సిక్సర్లతో విచుకుపడ్డాడు. చివరి వరకు తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే, అతడు అవుటయ్యాక అప్పటి వరకు చెన్నై చేతిలో ఉన్న విజయం కాస్తా ముంబైకి మారింది. చివరి బంతికి రెండు పరుగులు సాధించలేక చెన్నై చేతులెత్తేసింది.

వాట్సాన్‌ కు గాయమైన విషయం అతడి సహచరుడు హర్భజన్ సింగ్ తన ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసేంత వరకు తెలియకపోవడం గమనార్హం. ఫీల్డింగ్‌ లో డైవ్ చేస్తూ వాట్సన్ గాయపడ్డాడని - మోకాలికి రక్తం కారుతుండగానే బ్యాటింగ్ చేశాడని - జట్టును గెలిపించాలన్న అతడి తాపత్రయం భేష్ అంటూ కొనియాడాడు. అంతేకాదు, మ్యాచ్ ముగిసిన తర్వాత మోకాలికి ఆరు కుట్లు కూడా పడ్డాయని చెప్పడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. విషయం తెలిసి చెన్నై ఫ్రాంచైజీ కూడా కోప్పడిందట. అంత బాధలో ఎలా బ్యాటింగ్ చేశావని ప్రశ్నించదట. మాటమాత్రమైనా ఎందుకు చెప్పలేదని - ఏమైనా అయితే పరిస్థితి ఏంటంటూ కోప్పడిందట. ఇక, అభిమానులు సైతం వాట్సాన్‌ ను ప్రేమగా కోప్పడుతున్నారు. ప్రపంచకప్ ముందుంచుకుని ఇలాంటి పిచ్చిపనులు ఏంటని - ఇంకోసారి ఇలా చేయొద్దని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా తన జట్టును గెలిపించాలనే వాట్సన్ తాపత్రయం ముందు ఓటమి కూడా ఓడిపోయిందంటూ అభిమానులు కీర్తిస్తున్నారు.