Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళుతున్నారా? ఈ అప్డేట్ తెలుసుకోండి!

By:  Tupaki Desk   |   22 Dec 2021 3:41 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళుతున్నారా? ఈ అప్డేట్ తెలుసుకోండి!
X
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ఆలోచన ఉందా? మీరు కాకున్నా మీ ఇంట్లోని వారు.. స్నేహితులు.. తెలిసిన వారు ఎవరైనా వెళుతున్నారా? అయితే.. వారికి ఈ అప్డేట్ మీరు అందించాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారిలో అత్యధికులు ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకోవటం తెలిసిందే. తమకున్న లగేజ్ కారణంగా.. టైమింగ్ కారణంగా వీలైనంత ఎక్కువమంది క్యాబ్ లలో వెళుతుంటారు. అయితే.. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో స్పష్టత లేని నేపథ్యంలో ఊబర్.. ఓలా సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లుగా క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ స్పష్టం చేస్తోంది.

దీంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నిత్యం వెళ్లే 3వేలకు పైగా క్యాబ్ సర్వీసులు ఈ రోజు నుంచి వెళ్లే అవకాశం లేదు. కరోనాకు ముందు నిత్యం ఐదు వేల వరకు క్యాబ్ సర్వీసులు ఎయిర్ పోర్టుకు నడిపేవారు. కొవిడ్ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఇవి కాస్తా మూడు వేలకు తగ్గాయి. దీనికి తోడు విమాన రాకపోకలు తగ్గటంతో గిరాకీ తగ్గింది. ఓవైపు ప్రయాణికుల రాకపోకలు..మరోవైపు డీజిల్.. పెట్రోల్ ఛార్జీలు భారీగా పెరగటంతో క్యాబ్ సర్వీసు నిర్వహణ కష్టంగా మారింది.

దీంతో క్యాబ్ డ్రైవర్లు కిలోమీటరు ఛార్జీని రూ.22కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓలా.. ఊబర్ సంస్థలు తీసుకునే కమిషన్ ను తగ్గించుకోవాలని కోరుతున్నారు. గతంలో ఒక క్యాబ్ డ్రైవర్ సరాసరిన రోజుకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు సంపాదించేవారని.. కానీ నేడు రోజుకు వెయ్యి కూడా సంపాదించటం లేదని చెబుతున్నారు. ఓలా.. ఊబర్ సంస్థలు 30 శాతం కమిషన్ తీసుకోవటంతో తమకు వచ్చిన ఆదాయం మొత్తం సదరు సంస్థలకే వెళ్లిపోతుందని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సేవల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ రెండు యాప్ ఆధారిత క్యాబ్ సేవలు ఇప్పుడు అందుబాటులో ఉండవు. ఈ విషయం తెలీక.. టైంకు క్యాబ్ బుక్ చేసుకుందామనుకున్న వారికి కొత్త కష్టాలు తప్పవు. అందుకే.. కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే.. ఓలా.. ఊబర్ సంస్థలు తమ సేవల్ని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నిలిపివేయటంతో.. వారికి ప్రత్యామ్నాయంగా ‘‘చాయిస్.. క్విక్ రైడ్.. 4వీల్స్’’ సంస్థల్ని ఎయిర్ పోర్టు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. వాటిని బుక్ చేసుకోవాలని కోరుతున్నారు.