Begin typing your search above and press return to search.

టీమిండియాలో మతం చిచ్చు.. షమీపై వివక్ష.. ఓవైసీ ఫైర్

By:  Tupaki Desk   |   25 Oct 2021 1:50 PM GMT
టీమిండియాలో మతం చిచ్చు.. షమీపై వివక్ష.. ఓవైసీ ఫైర్
X
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. పాక్ చేతిలో భారత్ ఓటమి భారతీయులను షేక్ చేసింది. ఈ క్రమంలోనే రకరకాల కారణాలను వెతికి మరీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు ఓటములపై క్రీడాకారులను బాధ్యులను చేసి విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే లాస్ట్ ఓవర్ వేసి పాకిస్తాన్ గెలవడానికి కారణమయ్యాడని బౌలర్ మహ్మద్ షమీపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

టీ 20 ప్రపంచకప్ క్రికెట్ లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓడిపోవడానికి బౌలర్ మహ్మద్ షమీ ఒక్కడే బాధ్యుడా అని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కామెంట్ల వర్షం కురుపించడంపై అసద్ మండిపడ్డారు.

మహ్మద్ షమీని ఒక్కడినే టార్గెట్ చేయడం ముస్లింల పట్ల వ్యతిరేకతను, ద్వేషాన్ని తెలియజేస్తోందన్నారు. ఆట అన్నాక గెలుపు, ఓటములు సహజం అని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. జట్టులో మొత్తం 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక ముస్లిం ప్లేయర్ ను మాత్రమే ఎలా టార్గెట్ చే్సతారని అసద్ ప్రశ్నించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుందా? అని ఓవైసీ నిలదీశారు.

ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ టీ20 మ్యాచ్ లో భారత జట్టు దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం షమీ అంటూ, రోహిత్, రాహుల్ అంటూ వివిధ వర్గాల విమర్శలు గుప్పిస్తున్నారు.