Begin typing your search above and press return to search.

ఈ కాంగ్రెస్ నేతలకు ఏమైంది?

By:  Tupaki Desk   |   19 Nov 2015 4:17 AM GMT
ఈ కాంగ్రెస్ నేతలకు ఏమైంది?
X
ఉగ్రవాదుల మీద ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కావటమే కాదు.. అధికార.. విపక్షాలు అన్న తేడా లేకుండా అందరూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడుతున్న వారే. చివరకు.. ముస్లింలోని ఉదారవాదులు పెద్దఎత్తున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెదవి విప్పటమే కాదు.. ఇస్లామిక్ స్టేట్ వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతున్నారు. పద్ధతి మార్చుకోవాలని సూచించటమే కాదు.. భారీ ఫత్వాను జారీ చేయటం తెలిసిందే. ఇలా మతాలకు అతీతంగా ఇస్లామిక్ స్టేట్ సంస్థపైనా.. ఉగ్రవాదంపైనా అగ్రహం వ్యక్తమవుతుంతే.. అందుకు భిన్నమైన రీతిలో మతాల పేరుతో ఆందోళనకరమైన వ్యాఖ్యల్ని చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

బీజేపీ.. కాంగ్రెస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు.. తాజాగా మరో దశకు చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన ఒక ఛానల్ లో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.. భారత్ - పాక్ దేశాల మధ్య చర్చలు పున: ప్రారంభం కావాలంటే ప్రధాని పదవి నుంచి మోడీని తప్పించాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం.. పాక్ పట్ల ఎన్డీయే ప్రభుత్వం కఠిన వైఖరిని అనుసరిస్తుందని మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం తెలిసిందే. మణిశంకర్ అయ్యర్.. సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లవెత్తటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత.. ఆ పార్టీ ప్రధానకార్యదర్శి షకీల్ అహ్మద్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

ఛోటా రాజన్.. అనూప్ చెతియాలు ముస్లింలు కాకపోవటంతో సరిపోయిందని.. వారు కానీ ముస్లింలు అయి ఉంటే.. మోడీ ప్రభుత్వ వైఖరి మరోలా ఉండేదంటూ ట్వీట్ చేశారు. ఇది కొత్త వివాదంగా మారింది. మత ప్రాతిపదికను ఉగ్రవాదాన్ని విభజించటం ఏమిటంటూ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. షకీల్ వ్యాఖ్యలు అవమానకరమని.. దీనికి ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణలు చెప్పలంటూ కమలనాథులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.

తాను చేసిన ట్వీట్ రేపిన మంటలతో షకీల్ అహ్మద్ స్పందించారు. బీజేపీ ద్వంద వైఖరిని బయట పెట్టేందుకే తానీ వ్యాఖ్యలు చేసినట్లుగా సమర్థించుకున్నారు. ఒకవేళ ఛోటా రాజన్ కానీ ముస్లిం అయి ఉంటే.. వారు ముస్లింలు అయినందు వల్లే యూపీఏ సర్కారు వారిని పట్టుకోలేదని వ్యాఖ్యలు చేసేదని.. ఆ విషయాన్ని చెప్పటానికే తానీ వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘‘వారు చేస్తున్న వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అంటూ డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో కాంగ్రెస్ అలెర్ట్ అయ్యింది. నేతలు చేసే వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చింది. అదే నిజమైతే.. బీజేపీ ఫైర్ బ్రాండ్లు చేసే వివాదాస్పద వ్యాఖ్యల్ని సైతం.. వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించి.. కాంగ్రెస్ నేతలు రచ్చ చేయకుండా అపేయొచ్చుగా. నేతల నోటి నుంచి వచ్చే వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో తమకో న్యాయంగా.. ప్రత్యర్థి పార్టీలకు మరో న్యాయం చెప్పటం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు సబబు..? సున్నిత అంశాల విషయంలో నేతలు ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయంలో.. ఇంతటి బాధ్యతారాహిత్యంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎందుకు మాట్లాడుతున్నట్లు..?