Begin typing your search above and press return to search.

బాన్సువాడలోని ఆ పోస్టుమ్యాన్ గురించి తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   20 Dec 2020 3:30 PM IST
బాన్సువాడలోని ఆ పోస్టుమ్యాన్ గురించి తెలిస్తే షాకే
X
అతడో పోస్ట్ మ్యాన్. నిత్యం తమకు వచ్చే లెటర్లను వాటిలో ఉన్న చిరునామాలో ఉన్నట్లుగా డెలివరీ చేయాలి. ఎంతో బాద్యతగా నిర్వర్తించాల్సిన ఈ ఉద్యోగాన్ని దుర్మార్గంగా వ్యవహరించటమే కాదు.. అతడి కారణంగా వేలాది మంది తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. ఒక పోస్టు మ్యాన్ ఏమిటి? వేలాది మందిని నష్టపోయేలా చేయటం ఏమిటని అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ తినాల్సిందే.

బాన్సువాడ మండలంలోని తాడ్కోలుకు చెందిన బాలక్రిష్ణ 2019 జనవరి ఒకటిన పోస్టు మ్యాన్ గా చేరారు. అప్పటి నుంచి అతగాడు రెండేళ్లుగా ఒక్క ఉత్తరాన్ని డెలివరీ చేయలేదట. ఏ రోజుకు ఆ రోజు తాను బట్వాడా చేయాల్సిన ఉత్తరాల్ని.. పత్రాల్ని తీసుకొని తన బంధువు హోటల్ లో దాచి పెట్టేవాడు. అదే పనిగా ఉత్తరాలు డెలివరీ కావటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోస్టల్ శాఖ తనిఖీ చేసింది.

ఈ సందర్భంగా అదికారులు అవాక్కు అయ్యే పరిస్థితి. ఎందుకంటే.. మొత్తం 12 సంచుల్లో దాదాపు 7 వేలకు పైగా ఉత్తరాలు లభించాయి. వీటిల్లో ఆధార్ కార్డులు.. పాన్ కార్డులతో పాటు వివిధ పుస్తకాలు.. బ్యాంకు స్టేట్ మెంట్లు ఉన్నాయి. ఇతగాడి నిర్లక్ష్యంగా వేలాది మంది ఇబ్బంది పడటమే కాదు.. పలు సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఇతగాడి నిర్వాకం గురించి తెలిసిన వారంతా పళ్లు నూరుతున్నారు. విధి నిర్వహణలో ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన అతడ్ని పోస్టల్ శాఖ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.