Begin typing your search above and press return to search.

అబ్బాసీ రాక‌తో... పాక్ తీరు మారుతోందిగా!

By:  Tupaki Desk   |   30 Aug 2017 4:50 AM GMT
అబ్బాసీ రాక‌తో... పాక్ తీరు మారుతోందిగా!
X
దాయాదీ దేశాలుగా ప్ర‌పంచ దేశాల‌తో గుర్తింపు పొందిన భార‌త్‌ - పాకిస్థాన్‌ ల మ‌ధ్య నిత్యం యుద్ధ వాతావ‌ర‌ణ‌మే చోటుచేసుకుంటోంది. ఇరు దేశాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద నిత్యం తుపాకుల మోత‌లు మోగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ భూభాగం కేంద్రంగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఉగ్ర‌వాద సంస్థ‌లు... నిత్యం భార‌త్‌లో చొర‌బ‌డి అల్ల‌క‌ల్లోలం సృష్టించేందుకు నిత్యం ప‌థ‌క ర‌చ‌న చేస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టిదాకా భారత్‌లో చోటుచేసుకున్న ఉగ్ర‌వాద దాడుల‌న్నీ కూడా పాక్ భూభాగంపై రూపొందిన‌వేన‌న్న వాద‌న‌లో ఎంత‌మాత్రం అస‌త్యం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... పాక్ భూభాగంపై ఉగ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ ఇస్తున్న ఉగ్ర‌వాద సంస్థ‌లు.. వారిని భార‌త్‌లోకి చొప్పించి... ఉగ్ర నేత‌లు మాత్రం పాక్ భూభాగం మీద నుంచే వారిని ఆప‌రేట్ చేస్తున్న వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యంపై భార‌త్ గ‌ళ‌మెత్తినా... స‌రైన సాక్ష్యాలు ఇస్తే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పే పాక్‌... ఒక్క‌టంటే ఒక్క‌సారి కూడా భార‌త్ అందించిన సాక్ష్యాల‌ను సానుకూల దృక్ప‌థంతో ప‌రిశీలించిన దాఖ‌లా లేదు.

అంటే.. ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న పాక్ ఇక మారదా? అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం కాగా... మారే స‌మ‌స్యే లేద‌న్న స‌మాధానాలు కూడా వినిపించాయి. అయితే ఆ దేశ ప్ర‌ధానిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన షాహిద్ ఖ‌కాన్ అబ్బాసీ మాట‌లు చూస్తే... స‌మీప భ‌విష్య‌త్తులోనే పాక్ త‌న మొండి వైఖ‌రికి స్వ‌స్తి చెప్పే అవ‌కాశాలున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అవినీతి ఆరోప‌ణ‌ల్లో నిండి మునిగిన ఆ దేశ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌... ఆ దేశ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పుతో ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది. అయితే అప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశాలు లేని నేప‌థ్యంలో ష‌రీఫ్ స్థానంలో పాక్ నూత‌న ప్ర‌ధానిగా అబ్బాసీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌త వారాంతంలో అబ్బాసీ అక్క‌డి ఓ స్థానిక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. భార‌త్‌ తో క‌లిసి ప‌నిచేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు.

భారత్‌ తో చేయి క‌లిపి ఉగ్ర‌వాదాన్ని కూక‌టి వేళ్ల‌తో పెక‌లించి వేసేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగానే ఉంద‌ని, ఇదే జ‌రిగితే ద‌క్షిణాసియాలో శాంతి నెల‌కొంటుంద‌ని కూడా అబ్బాసీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ద‌క్షిణాసియాలో శాంతి సామ‌ర‌స్యాల‌ను నెల‌కొల్పే దిశ‌గా భార‌త్ కు స్నేహ హ‌స్తం ఇచ్చేందుకు కూడా త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కూడా అబ్బాసీ పేర్కొన్నారు. అయితే భార‌త్ నుంచి కూడా ఈ త‌ర‌హా స్పంద‌న రావాల్సి ఉంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అంత‌టితో ఆగ‌ని అబ్బాసీ... కాశ్మీర్‌ లో తాము ఉగ్ర‌వాదుల‌కు ఎలాంటి స‌హ‌కారాలు అందించ‌డం లేద‌ని చెప్ప‌డ‌మే కాకుండా అక్క‌డి ముస్లిం స‌మాజానికి అవ‌స‌ర‌మైన మేర‌కు తోడ్పాటు మాత్ర‌మే అందిస్తున్నామ‌ని తెలిపారు. ఈ తోడ్పాటు ఏ త‌ర‌హాలో ఉంద‌న్న విష‌యాన్ని అబ్బాసీ పూర్తి స్థాయిలో ప‌రిశీలించి త‌ద‌నుగుణంగా చ‌ర్య‌లు చేప‌డితే... ఆయ‌న‌కు భార‌త్ నుంచి కూడా స్నేహ హ‌స్తం ల‌భించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే మాట అయితే వినిపిస్తుంది. చూద్దాం.... మ‌రి ఏం జ‌రుగుతుందో? అబ్బాసీ హ‌యాంలో ఇరు దేశాల మ‌ధ్య ఏ మేర‌కు సంబంధాలు మెరుగ‌వుతాయో?