Begin typing your search above and press return to search.

తన్నులు తప్పించుకోవడానికే అఫ్రిది అలా..

By:  Tupaki Desk   |   26 March 2016 7:37 AM GMT
తన్నులు తప్పించుకోవడానికే అఫ్రిది అలా..
X
మిగతా దేశాలతో పోలిస్తే ఉపఖండ దేశాల్లో క్రికెట్ అభిమానం చాలా ఎక్కువ. మిగతా దేశాలు మ్యాచ్ లు ఓడిపోతే.. కాసేపు బాధ పడి వదిలేస్తారు అభిమానులు. కానీ ఉపఖండంలో మాత్రం ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో జట్టు ఓడిపోతే అభిమానుల బాధ మామూలుగా ఉండదు. మరీ చిత్తుగా ఓడిపోయి ఇంటికి వస్తే అభిమానులు తట్టుకోలేరు. క్రికెట్ ను మతంగా భావించే భారత్ లోనూ కొన్నిసార్లు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించిన దాఖలాలున్నాయి.

ఇక పాకిస్థాన్ అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సందర్భాల్లో క్రికెటర్ల ఇళ్ల మీద రాళ్లేయడం.. ఎయిర్ పోర్టుల్లో కాపు కాసి క్రికెటర్లపై దాడులు చేయడానికి ప్రయత్నించడం.. తమ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం.. శవ యాత్రలు చేయడం.. దిష్టిబొమ్మలు దహనం చేయడం మామూలే. అందుకే ఏదైనా పెద్ద టోర్నీల్లో ఓడినపుడు ఆ దేశ ఆటగాళ్లు అందరూ కలిసి నేరుగా స్వదేశానికి వెళ్లరు. దుబాయికో.. ఇంకోచోటికో వెళ్లి కొన్ని రోజుల తర్వాత వేర్వేరుగా గుట్టుచప్పుడు కాకుండా స్వదేశానికి చేరుకుంటుంటారు. లేటెస్టుగా ఇండియా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ దారుణ పరాభవాలు చవిచూసింది. భారత్ చేతిలో మరోసారి పరాజయం చవిచూడటంతో పాటు వరుసగా మూడు మ్యాచ్ లు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ముఖ్యంగా కెప్టెన్ అఫ్రిది మీద వారికి కోపం పీకల దాకా ఉంది. ఆటలో విఫలమైనందుకే కాక.. టోర్నీ ఆరంభమవడానికి ముందు.. ‘‘మాకు పాకిస్థాన్ లో కంటే ఇక్కడే ఎక్కువ అభిమానం దొరుకుతోంది’’ అని కూడా వ్యాఖ్యానించడంతో ఆ దేశ అభిమానులు అఫ్రిది కోసం కాచుకుని కూర్చున్నారు. ఇప్పుడున్న కోపంలో అఫ్రిది దొరికాడంటే అతడికి తన్నులు తప్పవు. ఐతే ఈ పరిస్థితిని అర్థం చేసుకునే తమ దేశ అభిమానుల కోపాన్ని చల్లార్చడానికి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అఫ్రిది.

మొన్న మొహాలిలో న్యూజిలాండ్ తో మ్యాచ్ సందర్భంగా మాకోసం కాశ్మీర్ నుంచి చాలామంది జనాలు వచ్చారు అంటూ అఫ్రిది వ్యాఖ్యానించడం తెలిసిందే. అంటే భారత్ లో భాగమైనప్పటికీ కాశ్మీర్ జనాలకు పాకిస్థాన్ అంటేనే అభిమానమని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడన్నమాట అఫ్రిది. ఐతే ఒక్కసారి అంటే ఏదో పొరబాటు అనుకోవచ్చు. కానీ తమ చివరి మ్యాచ్ లో ఓడాక కూడా అలాగే మాట్లాడాడు అఫ్రిది. భారత్ లోనే ఎక్కువ ప్రేమ లభిస్తోందంటూ ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికే అఫ్రిది ఈ పిచ్చి వ్యాఖ్యానాలు చేసినట్లు స్పష్టమవుతోంది.