Begin typing your search above and press return to search.

ఖర్చు ఇండియా కు.. కిక్కు పాకిస్తాన్ కు

By:  Tupaki Desk   |   25 Feb 2020 11:55 AM GMT
ఖర్చు ఇండియా కు.. కిక్కు పాకిస్తాన్ కు
X
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ..రెండు రోజుల పర్యటనల నిమిత్తం భారత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ట్రంప్ ..నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సభా వేదికపై నుండి ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ ..కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా పాక్ ఇప్పటికి మాకు ఒక మంచి మిత్ర దేశం అని , పాకిస్తాన్ తో దోస్తీ కొనసాగిస్తామని అన్నారు. అయితే , ట్రంప్ "నమస్తే ట్రంప్ " సభలో మాట్లాడుతూ చేసిన ఆ వ్యాఖ్యలని ఇప్పుడు పాక్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేస్తుంది.

బీజేపీ సర్కారు ఎంతో శ్రమకోర్చి అహ్మదాబాద్ లో అట్టహాసంగా 'నమస్తే ట్రంప్' ఈవెంట్ నిర్వహిస్తే.. అమెరికా అధ్యక్షుడు మాత్రం పాకిస్తాన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇండియాలో డైవర్సిటీపైనా ప్రధాని మోదీకి చురకలు వేశారు అంటూ పాకిస్తానీలు తెగ ఆనందపడుతున్నారు. మరోవైపు, భారత్-పాకిస్తాన్ సంబంధాల విషయంలో ప్రధాని మోదీ పాత్రను ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ అనే ఒకేఒక వ్యక్తి వల్ల భారత్ - పాకిస్తాన్ సంబంధాలకు బీటలు ఏర్పడ్డాయని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం ఈ పరిస్థితి చక్కబడే అవకాశమేలేదని , ఓ మీడియా సంస్థకు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ కామెంట్లు చేశారు. రెండు దేశాల మధ్య క్రికెట్ తో సహా అన్ని సంబంధాలు మోదీ ఉన్నంత కాలం ముందుకుపోలేవన్నారు. చరిత్ర పొడవునా కలిసేఉండి, 70 ఏళ్ల క్రితం విడిపోయాం. భారత్ - పాకిస్తాన్ ప్రజలు స్వేచ్ఛగా సరిహద్దులు దాటాలని కోరుకుంటారు. కానీ దాన్ని అమలు కానివ్వొద్దన్నదే మోదీ అజెండాగా కనిపిస్తోంది. ఆయనది నెగటివ్ మైండ్‌సెట్.. అది రోజురోజుకూ ఇంకా దిగజారుతోంది అని అఫ్రిది తన అక్కసు వెళ్లగక్కారు. అలాగే పాకిస్తాన్ లోని పలు ప్రధాన పత్రికలు కూడా , తమ పేపర్ లో ట్రంప్ మాటలని ప్రధానంగా రాశాయి. అలాగే కొన్ని పత్రికలు - వెబ్ సైట్లయితే ‘ఖర్చు ఇండియాకు.. కిక్కు పాకిస్తాన్ కు' తరహాలో ఇష్టమా వచ్చినట్టు రాశాయి.