Begin typing your search above and press return to search.

మళ్లీ సమంత మీద పడిన షబ్బీర్

By:  Tupaki Desk   |   20 Feb 2017 11:37 PM IST
మళ్లీ సమంత మీద పడిన షబ్బీర్
X
ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా మారింది ప్రముఖ నటి సమంత వ్యవహారం. తెలంగాణ ప్రభుత్వం అడిగిందన్నఉద్దేశంతో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఓకే అన్న ఆమె.. రాజకీయ విమర్శలకు దొరికిపోయిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పారితోషికం ఏమీ లేకున్నా.. మంత్రి కేటీఆర్ మాటతో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సిద్ధమైన సమంత మీద రాజకీయ దాడిని స్టార్ట్ చేశారు షబ్బీర్ అలీ.

ఈ మధ్యనే సమంతపై విమర్శలు చేసిన ఆయన.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యల్నే వినిపించారు. చీర కట్టుకోవటం తెలంగాణ మహిళలకు రాదా? అని ప్రశ్నిస్తున్న షబ్బీర్.. నాగార్జునకు కాబోయే కోడలు సమంతకే తెలుసా?.. ఆమె తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడరా?.. ఇవి తండ్రీకొడుకులతమాషాలు కావా? అంటూ ఫైర్ అయ్యారు.

గోదావరి నీళ్లు తాము తీసుకొస్తే.. ఇప్పుడు తండ్రీ కొడుకులు నెత్తి మీద చల్లుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నట్లుగా విమర్శించారు. ఈ తరహా విమర్శలు రాజకీయంగా షబ్బీర్ కు.. కాంగ్రెస్ పార్టీకి ఎంతోకొంత మేలు చేయొచ్చు.కానీ.. ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేకున్నా.. మహిళను అవమానించేలా మాటలు తూలటం అంత మంచిది కాదన్న విషయం షబ్బీర్ కు ఎప్పుడు తెలుస్తుందో..? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే.. షాకింగ్ లాంటి అంశాల్ని తీసుకురావాలే కానీ.. సమంత లాంటి వారి మీద పడటం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.