Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఫెయిల్.. మండలిలో మంటలే

By:  Tupaki Desk   |   30 Sept 2015 10:37 AM IST
అసెంబ్లీలో ఫెయిల్.. మండలిలో మంటలే
X
రైతుల ఆత్మహత్యల విషయమై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో అందరి దృష్టిలో మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పడితే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం తేలిపోయారు. టీ కాంగ్రెస్ నేతలతో పోలిస్తే.. తెలంగాణ తెలుగుదేశం ఫర్లేదనిపించింది. పెద్దరికం హోదాలో వ్యవహరించాలన్న కారణమే ప్రధానప్రతిపక్షం ఫెయిల్ అయిన మాటను మూటగట్టుకున్నారు.

అసెంబ్లీలో చూసీ చూడనట్లు వ్యవహరించిన శాసనమండలిలో మాత్రం మంట పుట్టించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొంగులేని సుధాకర్ రెడ్డి.. షబ్బీర్ అలీలు చెలరేగిపోయారు. వారి మాటల తూటాలకు తెలంగాణ అధికారపక్షం నేతల నోట మాట రాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలపై మాట్లాడిన పొంగులేటి.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘మా జాతకం ఇట్టుంది. రాష్ట్రం ఇచ్చి పక్క రాష్ట్రం కోల్పోయాం. మా ఖర్మ బాగాలేదు. మీ ఖర్మ కాలకుండా చూసుకోండి. రైతు గోస రాజ్యానికి మంచిది కాదు. కేసీఆర్ శ్రీరామ చంద్రుడ్ని వదిలేసి.. యాదాద్రిని పట్టుకున్నారు’’ అంటూ చురకలు వేశారు. రైతుల ఆత్మహత్యల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న మాటతో పాటు.. రాష్ట్ర విభజన నిర్ణయం ఎంత పెద్దదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

పొంగులేటి మాటలు ఇలా ఉంటే.. షబ్బీర్ అలీ మాటలు మరికాస్త చురుగ్గా సాగాయి. తెలంగాణ సర్కారు మాటల్ని తన మాటలతో చెబుతూ చీల్చి చెండాడారు. ‘‘ఏమన్నా అంటే పదహారు నెలలు అంటారు. నిప్పల్ గా దూద్ పీతే (పాలపీక పెట్టుకొని తాగుతున్నారా?) పెళ్లి చేసుకుంటే తొమ్మిది నెలల్లో పిల్లలే పుడతారు. తప్పించుకోవటానికి సిగ్గు శరం ఉండాలె. ఇంకా నిద్రలో ఉంటే ఎట్లా?’’ అంటూ చిరాకు పడిపోయారు.