Begin typing your search above and press return to search.

ఏపీలో అబ్బాయిలకు లైంగిక వేధింపులు

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:41 AM GMT
ఏపీలో అబ్బాయిలకు లైంగిక వేధింపులు
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఇంతకాలం అమ్మాయిలకు మాత్రమే లైంగిక వేధింపుల మాట వినిపించేది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీలోని అబ్బాయిలు.. అది కూడా యుక్త వయసులోని అబ్బాయిలకు తరచూ లైంగిక వేధింపులకు గురి అవుతున్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇంతకూ అబ్బాయిలకు లైంగిక వేధింపులు ఎవరి కారణంగా ఎదురవుతున్నాయో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇతర అబ్బాయిలతోనే ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు.

ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఏపీలో 192 గురుకుల హాస్టళ్లు ఉండగా వాటిలో 1.07లక్షల మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇరుకైన గదుల్లో నలభై మంది వరకూ విద్యార్థులు ఉంటున్నారు. రాత్రిళ్లు పక్కపక్కనే పడుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ఫోన్లలో నీలి చిత్రాలు చూడటం.. హార్మోన్ల ప్రభావంతో కొందరు విద్యార్థులు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు. ఈ కారణంగా పలువురు విద్యార్థులు లైంగిక వేధింపులకు గురి అవుతున్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. గురుకుల హాస్టళ్లలో ఐదు నుంచి ఇంటర్ వరకూ చదివేవారు ఉంటారు. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్ విద్యార్థుల్లో ఎక్కువమంది మిగిలిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో కొందరు విద్యార్థులు తాము పడుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు చెప్పటం.. మరికొన్ని ఉదంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా ఫిర్యాదులు అందటంతో ఎలా ఈ సమస్యను కట్టడి చేయాలన్నది ఇప్పుడో సమస్యగా మారింది. మానసిక వైద్య నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ చేయించాలని భావిస్తున్నా.. దీంతోనే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఎంత మేర ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందట.