Begin typing your search above and press return to search.

కస్టమర్లు డబ్బులు ఇవ్వకుంటే అది రేప్ కాదు

By:  Tupaki Desk   |   12 Oct 2016 7:28 AM GMT
కస్టమర్లు డబ్బులు ఇవ్వకుంటే అది రేప్ కాదు
X
సుప్రీంకోర్టు ఒక ఆసక్తికర తీర్పును ఇచ్చింది. అత్యాచారం కేసుకు సంబంధించిన నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కస్టమర్లు తమకు డబ్బులు ఇవ్వనంత మాత్రాన సెక్స్ వర్కర్లు తమపై అత్యాచారం జరిగిందంటూ చెప్పటం సరికాదని పేర్కొంది. సాక్ష్యాల్ని పరిశీలించటంతోపాటు.. వాస్తవాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ చెప్పిన ఈ తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పినాకి చంద్రఘోష్.. జస్టిస్ అమితవరాయ్ లతోకూడిన ధర్మాసనం వెలువరించిన తాజా తీర్పుకు సంబంధించిన కేసు వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఒక మహిళ.. తనను ముగ్గురు వ్య‌క్తులు అపహరించి గ్యారీజీలోకి తీసుకెళ్లి పదే పదే అత్యాచారం చేసినట్లుగా ఆరోపించారు. తనను ఆటోలో అపహరించారన్న ఆమె ఫిర్యాదుపై విచారించిన కర్ణాటక హైకోర్టు ఈ ఘటనలో ముగ్గురిని దోషులుగా నిర్దారించింది. అయితే.. ఈ తీర్పును నిందితులు సుప్రీం కోర్టులో సవాలు చేశారు.

ఈ ఉదంతంపై మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానానికి దీనికి సంబందించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అత్యాచారం జరిగినట్లుగా చెబుతున్న మహిళ రూమ్మేట్ ఇచ్చిన సాక్ష్యం కొత్త మలుపు తిప్పినట్లైంది. నిందితుల వద్ద నుంచి బాధితురాలు అప్పుడప్పుడు డబ్బులు తీసుకొనేదని.. రాత్రివేళలో వ్యభిచార వృత్తిలో ఉండేదన్న విషయం బయటకు వ‌చ్చింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వెయ్యి రూపాయిలు ఇవ్వకపోవటంతో ఆమె కేసు పెట్టిందని సాక్ష్యం ఇవ్వటంతో సుప్రీం కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది.

బాధితురాలు చెబుతున్న ఆధారాలు.. ఆమె అత్యాచారానికి గురైనట్లుగా లేవని.. అది పరస్పర అంగీకారంతో జరిగినట్లుగా ఉందన్న భావనను సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాక్ష్యం బలంగా ఉండటం..కేసును కొట్టివేయాలంటూ ప్రాసిక్యూషన్ డిఫెన్స్ న్యాయవాది చేసిన వినతిని అంగీకరిస్తూ సుప్రీం ధర్మాసనం కేసును కొట్టేసింది. విటులు డబ్బులు ఇవ్వనంత మాత్రాన సెక్స్ వర్కర్లు తమపై అత్యాచారం జరిగిందని చెప్పలేరంటూ సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/