Begin typing your search above and press return to search.

లేడీ డాన్ నిషా ఖాన్ అరెస్టు

By:  Tupaki Desk   |   20 Oct 2017 8:25 AM GMT
లేడీ డాన్ నిషా ఖాన్ అరెస్టు
X
హైద‌రాబాద్ పోలీసుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన లేడీ డాన్‌ - సెక్స్ రాకెట్ స్పెష‌లిస్ట్ నిషా ఖాన్‌ ను ఎట్ట‌కేల‌కు పోలీసులు అరెస్టు చేశారు. పేదింటి యువ‌తుల‌కు - మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హిళ‌లకు త‌న‌దైన శైలిలో వ‌ల విసురుతూ.. వారిపై డ‌బ్బులు వెద‌జ‌ల్లుతూ.. వారిని సెక్స్ కూపంలోకి దింపి కొన్ని వంద‌ల కుటుంబాల‌ను చింద‌ర వంద‌ర చేసిన నిషా ఖాన్ కాన్నాళ్ల కింద‌ట పెద్ద ఎత్తున వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఆమె బారిన మ‌హిళ‌లు ఇక‌ - ఆ కూపం నుంచి త‌ప్పించుకోవ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని పోలీసులు సైతం అంగీక‌రించారు.

హైద‌రాబాద్‌ లోని అత్యంత ర‌ద్దీ ప్రాంతం పాత‌బ‌స్తీ కేంద్రం పెద్ద ఎత్తున ముఠాను త‌యారు చేసుకుని ఈ లేడీ డాన్‌ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తోంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం - గతంలో పలుమార్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లొచ్చింది. అయినా కూడా ఆమె త‌న‌ వైఖరిని ఎంత‌మాత్ర‌మూ మార్చుకోలేదు. అయితే, పోలీసులు - కోర్టుల దెబ్బ‌కు గత మూడేళ్లుగా పంథా మాత్రం మార్చుకుంది. పేదింటి అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి - మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌కు ఆశ‌లు నెర‌వేర్చి.. బలవంతంగా వారిని ఈ రొంపిలోకి దింపి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది.

వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేది. ఆమె బారినుంచి తప్పించుకున్న ఇద్దరు బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపీ లాగిన పోలీసులు - ఉప్పల్ లోని హ్యాపీ హోమ్స్ లో నిషా ఖాన్ ఉందని - అక్కడే వ్యభిచార గృహాన్ని నడుపుతోందని గుర్తించారు. దాడి చేయగా - ముగ్గురు విటులు - నలుగురు అమ్మాయిలతో కలసి నిషాఖాన్ పట్టుబడింది. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు నిషా ఖాన్ నేతృత్వంలో నడుస్తున్న ఇతర వ్యభిచార గృహాలపై దృష్టిని సారించారు. మొత్తానికి త‌న దైన శైలిలో ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త‌ను వినియోగించుకుంటూ.. సెక్స్ రాకెట్‌ ను న‌డిపిస్తున్న మ‌హిళ ప‌ట్టుబ‌డ‌డంపై మ‌హిళా సంఘాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి