Begin typing your search above and press return to search.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. భారీ వర్షాలు

By:  Tupaki Desk   |   11 Oct 2020 6:00 PM IST
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. భారీ వర్షాలు
X
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అది తీవ్రరూపం దాల్చుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి అంచనాల ప్రకారం ఇది 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని తెలిసింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏపీలోనే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరం వెంబడి సహాయ చర్యలు చేపడుతోంది. జనాలను ఖాళీ చేస్తోంది.

ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలినచోట్ల విస్తారంగా మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి. మిగిలినచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని సమాచారం. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి తీవ్ర భారీవర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సముద్రం అలజడిగా ఉంటుంది మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాయుగుండం స్థితిని పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నారు.

తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తగినజాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.