Begin typing your search above and press return to search.

భానుప్రియ‌ను వ‌ద‌ల‌ బొమ్మాళీ

By:  Tupaki Desk   |   30 Jan 2019 10:38 AM GMT
భానుప్రియ‌ను వ‌ద‌ల‌ బొమ్మాళీ
X
మేటి క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన సీనియ‌ర్ న‌టి భానుప్రియ‌కు `ప‌ని పిల్ల‌` రూపంలో తీర‌ని అవ‌మానం ఎదుర్కోవాల్సి రావ‌డం ప్ర‌స్తుతం ఆమె అభిమానుల్ని కుంగుబాటుకు గురి చేస్తోంది. ప‌ని పిల్ల‌ను చిత్ర‌హింస‌లకు గురి చేయ‌డ‌మే గాక కిడ్నాప్ చేసింద‌ని, ఆమె సోదరుడు ఆ బాలికను లైంగికంగా వేధించార‌ని బాలిక తల్లి ప్రభావతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్ర‌మంలోనే ఔత్సాహిక టీవీ చానెళ్లు ఆ వార్త‌ను ప్ర‌ముఖంగా లైవ్ టెలీకాస్టుల పేరుతో పోటీప‌డి క‌థ‌నాలు వండి వార్చేశాయి. భానుప్రియ‌ను దోషిని చేసేస్తూ చానెళ్లు చాలానే హంగామా సృష్టించాయి. ఇంకా దీనిపై పోలీసులు కానీ, కోర్టులు కానీ ఏ విచార‌ణ చేప‌ట్ట‌క ముందే తాను మాత్రం దోషిగా నిల‌బ‌డింద‌న్న ఆవేద‌న అభిమానుల్లో క‌నిపిస్తోంది.

అదంతా అటుంచితే ఈ గొడ‌వ‌లో భానుప్రియ త‌ప్పేమీ లేద‌ని స‌ద‌రు బాలిక మీడియా - పోలీస్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. భాను ప్రియ త‌న‌ను కిడ్నాప్ చేయ‌లేద‌ని, వేధించ‌లేద‌ని స‌ద‌రు బాలిక అంగీక‌రించింది. ఇదే విష‌యాన్ని నిన్న‌టి రోజున మీడియా ముఖంగా భానుప్రియ సైతం చెప్పారు. ప‌న‌మ్మాయిని ఏనాడూ తాను ఇబ్బంది పెట్టలేద‌ని,... వేధింపుల పేరుతో త‌ప్పుడు కేసు భ‌నాయించార‌ని భానుప్రియ మీడియా ముందు అన్నారు. తన సోదరుడు బాలికను లైంగింకంగా వేధిస్తున్నాడని చెప్పినదంతా అబద్ధమని ఆమె తెలిపారు. ఇక ఆ బాలిక ఇంట్లోంచి దొంగిలించిన ఓ వాచ్ ను, కెమెరాను, వేరొక ఖ‌రీదైన వ‌స్తువును మీడియాలు లైవ్ లో చూపించాయి.

అయితే ఈ కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిస్తే.. ఇందులో భానుప్రియ చేసిన త‌ప్పిదం ఒక‌టి ఉంది. ఒక మైన‌ర్ అయిన‌ బాలిక‌ను ఇలా పనిలో పెట్టుకోవ‌డం త‌ప్పు.. అలాగే త‌న ముందు విలువైన వ‌స్తువులు క‌నిపించేలా చేసి.. త‌ను దొంగ‌త‌నానికి పాల్ప‌డేందుకు కార‌కుల‌వ్వ‌డం మ‌రో త‌ప్పు!! అంటూ.. అలాంటి ఓ చ‌ట్టం ఉంద‌ని మ‌రో వాద‌నా వినిపిస్తోంది. ఇవి యజ‌మాని నేరాల కింద లెక్క అని కార్మిక చ‌ట్టాలు చెబుతున్నాయ‌ట‌. ఆ కోణంలో భానుప్రియ‌ శిక్ష త‌ప్పించుకోలేర‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా బాలల హక్కుల సంఘం స్పందించింది. భానుప్రియను వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. మునుముందు ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయి? అన్న‌ది తెలియాల్సి ఉంది.