Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ సుప్రీం జ‌డ్జిని జూనియ‌ర్ని చేసిన మోడీ?

By:  Tupaki Desk   |   6 Aug 2018 5:22 AM GMT
సీనియ‌ర్ సుప్రీం జ‌డ్జిని జూనియ‌ర్ని చేసిన మోడీ?
X
మ‌రో వివాదానికి తెర తీసింది మోడీ స‌ర్కార్. చాలా ప్ర‌భుత్వాల మాదిరే.. న‌చ్చ‌ని వారిని అదే ప‌నిగా గిల్లుతూ.. గిచ్చుతూ.. త‌మ అధికారాన్ని ప్ర‌ద‌ర్శించే ద‌రిద్ర‌పు బుద్ధి మోడీ స‌ర్కారులో ఉంది. న్యాయంగా.. ధ‌ర్మంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న తీరు త‌మ‌లో త‌క్కువ‌నే విష‌యాన్ని త‌మ చ‌ర్య‌ల‌తో అప్పుడ‌ప్పుడు ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌ల పాల‌య్యే మోడీ స‌ర్కార్.. తాజాగా అలాంటి త‌ప్పునే మ‌రోసారి చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ కేఎం జోసెఫ్ కు ప్ర‌మోష‌న్ ను అయిష్టంగానే అంగీక‌రించిన కేంద్రం.. త‌న అయిష్ఠాన్నిఉత్త‌ర్వుల్లో త‌న‌దైన రీతిలో ప్ర‌ద‌ర్శించి సుప్రీం జ‌డ్జిల‌ను నొచ్చుకునేలా చేసింది. హైకోర్టు చీఫ్ జ‌డ్జిలుగా ఉన్న ముగ్గురిని సుప్రీం జ‌డ్జిలుగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీరంతా ఆగ‌స్టు 7న ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని భావిస్తున్నారు.

ఈ నియామ‌క ఉత్త‌ర్వుల‌లో జస్టిస్ కేఎం జోసెఫ్ ను మూడో స్థానంలో నిలుపుతూ కేంద్రం జారీ చేసిన అపాయింట్ మెంట్ మీద సుప్రీం జ‌డ్జిలు ప‌లువురు భ‌గ్గుమంటున్నారు. జోసెఫ్ తో పాటు.. జ‌స్టిస్ ఇందిరా బెన‌ర్జీ.. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌ణ్ లు కూడా సుప్రీం జ‌డ్జిలుగా ఎంపిక‌య్యారు. వాస్త‌వానికి ఈ ముగ్గురు న్యాయ‌మూర్తుల్లో జోసెఫ్ సీనియ‌ర్. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న పేరును మూడో స్థానంలో నిలుపుతూ నియామ‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్రం తీరుపై సుప్రీం జ‌డ్జిలు గుర్రుగా ఉన్నారు.

ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శించిన వైఖ‌రిని.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా దృష్టికి తీసుకెళ్ల‌ట‌మే కాదు.. కంప్లైంట్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కావాల‌నే జోసెఫ్ ను త‌క్కువ చేసి చూపించిన‌ట్లుగా అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నియామ‌క ఉత్త‌ర్వులో మూడో స్థానంలో ఉన్న‌ట్లు పేర్కొన‌టం వ‌ల్ల జ‌రిగే న‌ష్టం ఏమిటంటే.. కీల‌క‌మైన కేసుల కేటాయింపు స‌మ‌యంలో.. జోసెఫ్ కు వాటిని కేటాయించే వీలుండ‌ద‌ని చెబుతున్నారు.

ఈ ఇష్యూలో వివాదం ఏమిటంటే.. జోసెఫ్ నియామ‌కంపై సుప్రీం కొలీజియంకు.. కేంద్రానికి మ‌ధ్య లేఖ‌లు చాలానే న‌డిచాయి. చివ‌ర‌కు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో జోసెఫ్ ను సుప్రీంజ‌డ్జిగా ఓకే చేస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అయితే.. త‌న‌కు ఇష్టం లేని ప‌నిని త‌న చేతుల‌తో చేయిస్తున్న సుప్రీం కొలీజియంకు చిర్రెత్తేలా.. మోడీ స‌ర్కార్ త‌న ప‌వ‌ర్ ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా చెబుతున్నారు.

లిస్టులో మూడో పేరుగా జోసెఫ్ ను ఉంచ‌టం ద్వారా.. ఆయ‌న ప్రాధాన్య‌త‌ను త‌గ్గించిన‌ట్లుగా తెలుస్తోంది. దీన్ని న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో కేంద్రం ఘోర‌మైన జోక్యంగా వారు తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. జోసెఫ్ ను సుప్రీం జ‌డ్జిగా నియ‌మిస్తూ కొలీజియం చేసిన సిఫార్పుల‌పై కేంద్ర న్యాయ‌శాఖామంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ గ‌తంలో అనేక అభ్యంత‌రాల్ని వ్య‌క్తం చేశారు. వీటిని సుప్రీం తోచిపుచ్చింది. ఇంత‌కీ.. జ‌స్టిస్ జోసెఫ్ మీద కేంద్రానికి అంత గుర్రు ఎందుకు? జూనియ‌ర్ అంటూ గిల్లి.. గిచ్చేలా చేసి కొత్త వివాదాన్ని నెత్తిన ఎందుకు వేసుకుంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల్ని వెతికే ప్ర‌య‌త్నం చేస్తే.. పాత లెక్క‌ల్ని కొన్నింటిని చెప్పుకొస్తున్నారు.

2016లో ఉత్త‌రాఖండ్‌ లోని హ‌రీశ్ రావ‌త్ నేతృత్వంలోని కాంగ్రెస్ స‌ర్కార్ ను ప‌డేసిన కేంద్రం గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌ను విధించింది. ఈ తీరును అప్ప‌ట్లో ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ఉన్న జోసెఫ్ కేంద్రం తీరును త‌ప్పు ప‌డుతూ తీర్పును ఇచ్చారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై మోడీ స‌ర్కార్ గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతారు.

ఈ కార‌ణంతోనే ఆయ‌న్ను సుప్రీం జ‌డ్జి కాకుండా ఉండేలా మోకాల‌డ్డిన‌ట్లుగా చెబుతున్నారు. జోసెఫ్ వ్య‌వ‌హారాన్ని కేంద్రం ప‌ర్స‌న‌ల్ గా తీసుకోవ‌టం వివాదాల‌కు తావిచ్చేలా చేయ‌ట‌మే కాదు.. ఒక‌ద‌శ‌లో మోడీ స‌ర్కారు డిఫెన్స్ లో ప‌డింది. అంద‌రి చేత వేలెత్తి చూపించుకునే ప‌రిస్థితి రావ‌టంతో వెన‌క్కి త‌గ్గింది.

అయితే.. మ‌న‌సులోని కోపాన్ని.. అపాయింట్ మెంట్ లో మూడో స్థానంలో నిలిపి జూనియ‌ర్ ముద్ర వేయ‌టం ద్వారా మ‌రోసారి త‌ప్పు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లి.. త‌మ అసంతృప్తిని బాహాటంగా వ్య‌క్తం చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే.. మోడీ స‌ర్కార్ మరోసారి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డే వీలుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.