Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ ధర ఎందుకు ఎక్కువ అంటే మోడీ సర్కారు చేసిన తప్పు చెప్పిన సీరం?

By:  Tupaki Desk   |   25 April 2021 2:30 PM GMT
వ్యాక్సిన్ ధర ఎందుకు ఎక్కువ అంటే మోడీ సర్కారు చేసిన తప్పు చెప్పిన సీరం?
X
అందుకే అంటారు.. కోపంతో ఉన్నప్పుడు ఆవేశంతో ఉన్నప్పుడు అప్పటివరకు గుండెల్లో దాచుకున్నదంతా చెప్పేస్తుంటారని. తాజాగా వ్యాక్సిన్ ధరల్ని ప్రకటించిన తీవ్ర విమర్శలకు గురవుతున్న సీరం సంస్థ.. ఆ ధాటికి తట్టుకోలేక అసలు విషయాన్ని చెప్పేసింది. తద్వారా కేంద్రంలోని మోడీ సర్కారు చేసిన తప్పును చెప్పకనే చెప్పేసింది. విదేశాలతో పోలిస్తే.. భారత్ లో వ్యాక్సిన్ ధర ఎందుకు ఎక్కువగా ఉందన్న నిలదీత మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో తన వివరణను ఇచ్చే ప్రయత్నం చేసింది సీరం. అయినప్పటికి ఎవరూ శాంతించని పరిస్థితి. ఇలాంటివేళ.. భారత్ లో వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరించిన విధానమేనన్న విషయం పూనావాలా మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ దేశంలో టీకా ధరను నిర్ణయించే విషయంలోనూ.. మోడీ సర్కారుకు లింకేమిటన్న సందేహం వచ్చిందా? దాన్ని పూనావాలా తనదైన శైలిలో చెప్పేస్తున్నారు.

భారత దేశంలోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం సరికాదని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నప్పుడే నిధులు సమకూర్చుకోవటం.. ఒప్పందాలు చేసుకోవటమే కారణమని తెలిపారు. అందుకు భిన్నంగా భారత ప్రభుత్వం ఎలాంటి నిధులు అందించింది. ఈ కారణంగానే ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు తాము వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు. రిస్కు తీసుకొని.. ప్రయోగ దశల్లోనే వారు నిధుల్ని సాయంగా అందించారని.. తమ పరీక్షలు ఫలించాయని చెప్పారు.

మిగిలిన దేశాల మాదిరి.. కరోనా టీకాలపై జరుగుతున్న ప్రయోగాల సందర్భంలోనే మోడీ సర్కారు సీరంతో పాటు మిగిలిన సంస్థలకు అడ్వాన్సులు చెల్లించి ఉంటే.. ఈ రోజున ఈ స్థాయి ధరల్ని భరించాల్సి వచ్చేది కాదు. మిగిలిన దేశాలు ఆలోచించిన తరహాలో కేంద్రం ఎందుకు ఆలోచించనట్లు? అన్నది ప్రశ్న. ఈ లెక్కన చూస్తే.. మోడీ సర్కారు చేసిన తప్పునకు దేశ ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న భావన కలుగక మానదు.