Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ జాడ చూపే జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా చేస్తారు?

By:  Tupaki Desk   |   30 Dec 2021 10:01 AM IST
ఒమిక్రాన్ జాడ చూపే జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా చేస్తారు?
X
కరోనా కుటుంబం అంతకంతకూ పెరగటం తెలిసిందే. ఈ పెరిగే క్రమంలో కొన్ని మ్యూటెంట్లు చాలా డేంజర్ గా ఉంటాయి. ఆ కోవకు చెందిందే ఒమిక్రాన్. డెల్టా వేరియంట్ లో ప్రాణాపాయం ఎక్కువగా ఉంటే.. ఒమిక్రాన్ లో ప్రాణాలు తీసే లక్షణాలు తక్కువగా ఉన్నా.. అమితమైన వేగంగా వైరస్ విస్తరించే దరిద్రపుగొట్టు లక్షణం ఎక్కువ. ఇదే ప్రపంచాన్ని వణికించే అంశంగా చెప్పాలి. మొన్నటివరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఒమిక్రాన్.. ఈ మధ్యనే మన దేశంలోకి ఎంట్రీ ఇవ్వటం.. దీనికి సంబంధించిన కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

కరోనా లెక్క తేల్చేందుకు ఆర్టీపీసీఆర్ లాంటి పరీక్షలతో పక్కాగా తేల్చేయొచ్చు. కానీ.. ఒమిక్రాన్ మాత్రం అందుకు భిన్నమైంది. దాన్ని సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో గుర్తించలేం. అందుకే.. జీనోమ్ సీక్వెన్సింగ్ తప్పనిసరి. ఇంతకీ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే.. జన్యుక్రమ విశ్లేషణగా చెప్పాలి. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారికి మొదట కరోనా పాజిటివ్ పరీక్ష నిర్వహించి.. అందులో పాజిటివ్ గా తేలి.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానించిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతారు.

ఇప్పటివరకు హైదరాబాద్ లో సీసీఎండీ.. సీడీఎఫ్ డీ (సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్)కు పంపుతున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉండటంతో.. గాంధీ ఆసుపత్రిలోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించిన కిట్లు తక్కువగా లభిస్తుండటంతో.. ఈ కేసుల నిర్దారణ కాస్త కష్టమవుతోంది.

కొవిడ్ ఉందా? లేదా? అన్నది తేల్చటం ఇప్పుడు కష్టమైన విషయం కాదు. కానీ.. దానికి కారణమైన వైరస్ ఏ వేరియంట్ కు చెందింది? అన్నది దాని జన్యుపరంగా నిర్దారించాలి. అంటే తప్పనిసరిగా పాజిటివ్ శాంపిల్ ను జీనోమ్ స్వీక్వెన్సింగ్ కోసం వైరాలజీ ల్యాబ్ కు పంపాల్సి ఉంటుంది. ఒక్కో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు రూ.1.5కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రం.. రాష్ట్రాల అనుమతి తప్పనిసరి. ఈ ల్యాబ్ ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.

కొవిడ్ మొదట్లోనూ ఆర్టీపీసీఆర్ సెంటర్లు చాలా పరిమితంగా ఉండేవి. కేసుల సంఖ్య పెరిగిపోవటంతో.. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లను సిద్ధం చేశారు. ఈ ల్యాబ్ లలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు తగ్గట్లు మార్పులు చేసుకునే వీలుంది. ఇందుకోసం మిషనరీలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున.. వాటిని గుర్తించేందుకు అనువుగా ల్యాబ్ లను మార్పులు చేస్తున్నారు.

కొవిడ్ పాజిటివ్ అయిన ప్రతి వంద మందిలో ఐదుగురి శాంపిళ్లను కచ్ఛితంగా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే.. అది కచ్ఛితంగా అమలు కావటం లేదు. అదే సమయంలో బ్రిటన్ లో ప్రతి పది కేసుల్లో ఒకదాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం చేస్తున్నారు. దీంతో.. అక్కడ కొత్త వేరియంట్ ను సులువుగా గుర్తించటంతో పాటు.. సదరు వేరియంట్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని వారు గుర్తిస్తున్నారు. ఇదే విధానాన్ని మనం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ఇక.. ఖర్చు విషయానికి వస్తే.. ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ఆరేడు వందల్లో ఖర్చు అయితే.. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయటానికి దాదాపు రూ.5వేల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. దీంతో.. ఈ ఖర్చును తగ్గించుకోవటానికి ఒక మార్గాన్ని గుర్తించారు. కొవిడ్ శాంపిళ్లను ఎస్ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ పరీక్ష చేస్తారు. ఈ శాంపిల్ లో ‘ఎస్’ జన్యువు లోపించినట్లుగా గుర్తిస్తే.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని చెబుతున్నారు. ఇలా చేస్తే.. జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ల మీద పని భారం తగ్గటంతో పాటు.. ఖర్చు కూడా పరిమితంగా అవుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్ ధరల్ని చూస్తే.. ఆర్టీపీసీఆర్ కిట్ రూ.19 కాగా.. ఎస్ జీటీఎఫ్ కిట్ ధర రూ.240. ఈ రెండు కిట్లతో జీనోమ్ సీక్వెన్సింగ్ అవసరం ఉందా? లేదా? అన్నది తేలుతుంది. అందుకు అనుగుణంగా చేస్తే.. భారీ ఖర్చు తగ్గుతుంది. దీనికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించేందుక చేసే జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుకు టైం కూడా ఎక్కువే తీసుకుంటుంది.

అందుకే కేసుల పెరుగుదల అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. తక్కువ ఖర్చుతో.. త్వరగా నిర్ధారించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లను కనీసం 10 నుంచి 20 రెట్లు పెంచాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పుడు మాత్రమే పెరిగే కేసులకు తగ్గట్లే.. పరీక్షల్ని నిర్వహించే వీలుందని చెబుతున్నారు.