Begin typing your search above and press return to search.

నాటి 'వార్'లో ఒక్కటయ్యారు.. 'నేటి వార్'లో వేరయ్యారు

By:  Tupaki Desk   |   9 May 2022 11:30 PM GMT
నాటి వార్లో ఒక్కటయ్యారు.. నేటి వార్లో వేరయ్యారు
X
ప్రపంచ చరిత్ర గతిని మార్చిన యుద్ధాల్లో రెండో ప్రపంచ యుద్ధం ఒకటి.. అప్పటి అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా ఒక్కడవడం అయితేనేమి.? జపాన్ పై అణుబాంబు ప్రయోగం అయితేనేమి..? జర్మనీ నియంత హిట్లర్ పతనం అయితేనేమి..? 200 ఏళ్ల బ్రిటిష్ పాలనకు తెరపడి అసలు భారత్ కు స్వాతంత్ర్యం రావడం అయితేనేమి..? అన్నిటికి మించి హిట్లర్ దమనకాండతో.. బెంబేలెత్తి ఇజ్రాయిల్ వంటి ఓ దేశమే ఆవిర్భవించింది. మొత్తంమీద ఇలా ఎన్నో మార్పులు. ఆ యుద్ధంలో అత్యుత్సాహంతో అమెరికా పెరల్ హార్బర్ పై దాడి చేసిన జపాన్ తీవ్ర మూల్యం చెల్లించుకుని బుద్ధి తెచ్చుకుంది. అణుబాంబు దాడితో.. అతలాకుతలమై శాంతికాముక దేశంగా మారిపోయింది. అనంతర పరిణామాల్లో బంకర్ లోకి వెళ్లి జర్మనీ నియంత హిట్లర్ పిస్తోలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అసలు ఎలా పుట్టింది ఆ యుద్ధం..?

హిట్లర్ పాలనలోని జర్మనీ.. పోలండ్ ను ఆక్రమించడంతో పుట్టింది రెండో ప్రపంచ యుద్ధం. పోలండ్ కు మద్దతుగా 1939 సెప్టెంబరులో బ్రిటన్, ఫ్రాన్స్ రంగంలోకి దిగాయి. ఇది అలా ఆరేళ్ల పాటు జరుగుతూ పోయింది. సుమారు 6 కోట్ల మంది చనిపోయారని చెబుతారు. చరిత్రలో రక్తసిక్త యుద్ధాల్లో దీనిదే అగ్రస్థానం. వాస్తవానికి 1937లో చైనా-జపాన్ యుద్ధమూ (2వది) పరోక్ష కారణమైంది. ఆ యుద్ధం ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా, జపాన్ ఈ యుద్ధానికి దిగాయి. ఇక పోలండ్ పై జర్మనీ దురాక్రమణ యూరప్ లో సంక్షోభం రేపింది. దీంతో ప్రపంచ దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాలుగా విడిపోయాయి.

మొదట ఒకవైపే జర్మనీ, రష్యా

రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో పోలండ్ ను ఆక్రమించే విషయంలో జర్మనీ, రష్యా కలిసే కదిలాయి. కానీ, తర్వాత పరిణామాలు మారిపోయాయి. జర్మనీ.. బ్రిటన్ పై దాడులు సాగించడం, ఫ్రాన్స్ నూ లక్ష్యం చేసుకోవడం.. చైనా భూభాగాలను జపాన్ ఆక్రమించడం.. ఆ తర్వాత యుద్ధంలో అమెరికా ప్రవేశం.. ఇలా అనేక మార్పులు జరిగాయి. ఈ యుద్ధంలో.. జర్మనీ, జపాన్, ఇటలీ ఒక కూటమిగా ఉన్నాయి. మిగతా దేశాలు అంటే.. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, కొంత చైనా మిత్ర రాజ్యాలుగా కలిసి పోరాడాయి. అయితే, జర్మనీ యుద్ధంలో లొంగిపోవడం, అనంతరం హిట్లర్ ఆత్మహత్య, జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడితో జపాన్ కూడా లొంగిపోయింది.

ఇప్పుడదే రష్యాకు వ్యతిరేకంగా మిత్ర దేశాలు..

జర్మనీకి వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా-అమెరికా-బ్రిటన్ తదితరాలు ఒకవైపు ఉన్నట్లు చెప్పుకొన్నాం కదా..? కానీ, ఇప్పుడు అమెరికా-బ్రిటన్-జర్మనీ ఒక్కటయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను మొదటినుంచీ గట్టి ఖండిస్తున్న దేశాల్లో ఇవే ముందంజలో ఉన్నాయి. ఆంక్షల విధింపులో వీటికి జపాన్ కూడా తోడయింది. అంతేకాదు.. తమ ఆరు ద్వీపాలను రష్యా ఆక్రమించిందని జపాన్ ఇటీవల ఆరోపించింది. అయితే, చిత్రంగా చైనా మాత్రం ప్రస్తుతం పరోక్షంగా రష్యా పక్షం వహిస్తోంది. మొత్తానికి రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఇప్పటికి పరిస్థితుల్లో ఇదీ తేడా.

ఇజ్రాయిల్ పుట్టుకొచ్చింది..

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ .. యూదులను ఎలా చంపించారో ప్రపంచమంతా చూసింది. దీంతో యూదులు చెల్లాచెదురై పోయారు. లక్షలాది మంది చనిపోగా.. మిగిలినవారంతా తమ సొంతగడ్డను వెదుక్కుంటూ "ఇజ్రాయిల్" అనే దేశాన్నే స్థాపించుకున్నారు. ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయిల్ .. మధ్యవర్తిత్వ పాత్రకు సిద్ధమైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూదుడు కావడం, ఈ యుద్ధంతో ఆర్థికంగా యూదు సంపన్నులు నష్టపోతుండడమే దీనికి కారణం.

భారత్ కు స్వాతంత్ర్యం దక్కింది

బ్రిటీషర్లు.. రెండో ప్రపంచ యుద్ధం దెబ్బలతో తీవ్రంగా నష్టపోయారు. దాదాపు వందేళ్లుగా పోరాడుతున్నా భారత్ కు స్వాతంత్ర్యం ఇవ్వని వారు.. రెండో ప్రపంచ యుద్ధం దెబ్బతో దిగొచ్చారు. ఆ యుద్ధం ముగిసిన రెండేళ్లకే భారత్ ను వీడివెళ్లారు.

అప్పుడు అణుబాంబు.. ఇప్పుడు అణు బూచి

చివరిసారిగా ప్రపంచం అణుబాంబు దాడిని చూసింది 1945లో. నాడు జపాన్ పై అమెరికా ఈ పనిచేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి భయాలు ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో వ్యక్తమయ్యాయి. రష్యా.. అణు దళాలను హై అలర్ట్ చేసి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. అయితే, ఇప్పటికైతే తమకు ఆ ఆలోచన లేదని రష్యా తర్వాత అంటోంది.