Begin typing your search above and press return to search.

ఏపీలో కూడా ప్ర‌త్యేక హైకోర్టు డిమాండ్లు!

By:  Tupaki Desk   |   2 Jun 2016 12:44 PM GMT
ఏపీలో కూడా ప్ర‌త్యేక హైకోర్టు డిమాండ్లు!
X
అవును నిజ‌మే. ప్ర‌త్యేక హైకోర్టు కావాల‌ని తెలంగాణలోనే వినిపిస్తుంద‌ని అనుకోకండి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ అదే డిమాండ్ వినిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు న్యాయం జ‌ర‌గాలంటే ప్ర‌త్యేక హైకోర్టు ఒక్క‌టే మార్గ‌మ‌ని అవ‌స‌ర‌మనుకుంటే తాత్కాలిక న్యాయ‌స్థానం అయినా స‌రేన‌ని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘాధ్యక్షులు చిత్తర్వు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అమరావతిలోనే రాష్ట్ర అధికారిక కార్యకలాపాలను నిర్వహించాలని భావించి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక రాజధానిని ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం అభినందనీయమని చెప్పారు. అదే క్రమంలో రాష్ట్ర హైకోర్టును కూడా తాత్కాలికంగానైనా ఇక్కడే నిర్వహించాలని నాగేశ్వ‌ర‌రావు సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడి రెండేళ్లవుతున్నా పొరుగు రాష్ట్రంలో హైకోర్టు నిర్వహించడం తగదన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఏపీ హైకోర్టు ఉండటం శోచనీయమని, దీనివలన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. రాజకీయ - స్థల - నేర సంబంధిత నిందితులు బెయిళ్లు రాక జైళ్లలో మగ్గుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 300-1000 కి.మీ మేర రాష్ట్ర ప్రజలు ఆర్థిక - వ్యయప్రయాసల కోర్చి హైదరాబాద్‌ రావడంతో అనేక ఇక్కట్లు - ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఉమ్మడి హైకోర్టు 4 నెలల కిందట తీర్పునిస్తూ హైదరాబాద్‌ లోని హైకోర్టు తెలంగాణాకే చెందుతుందనే విష‌యాన్ని గుర్తుకుచేశారు. ఏపీలో నూతన హైకోర్టు ఏర్పడే వరకూ హైద‌రాబాద్‌ లో హైకోర్టు నిర్వహించుకోవచ్చునని, లేకుంటే ఏపీలోని రాయలసీమ - ఉత్తరకోస్తా - ఆంధ్రలలో 3 సర్క్యూట్‌ బెంచ్‌(తాత్కాలిక)లను ఏర్పాటు చేసుకోవచ్చునని సూచించిందన్నారు. దీని ప్రకారమైనా అమరావతిలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో త్వరలో అన్ని జిల్లా బార్‌ అసోసియోషన్‌ కమిటీలతో సీఎం చంద్రబాబును కలిసి అభిప్రాయం వెల్లడిస్తామని చెప్పారు.