Begin typing your search above and press return to search.

గంటా రూటే సెపరేట్.... ?

By:  Tupaki Desk   |   18 Feb 2022 9:30 AM GMT
గంటా రూటే సెపరేట్.... ?
X
ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన రాజకీయం కూడా సెపరేట్. ఆయనకు అర్ధబలం, అంగబలం చాలా ఉన్నాయి. వాటిని సమర్ధంగా ఉపయోగించగలిగే రాజకీయ వ్యూహాలు కూడా బోలేడు ఆయనకు ఉన్నాయి. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన మీటింగునకు వెళ్ళలేదు. దానికి ఆయన ఒక కారణం చెప్పారని ప్రచారం సాగుతోంది.

తనకు ముందుగా అనుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి తరువాత వచ్చి కలుస్తాను అని ఆయన అధినాయకత్వానికి వర్తమానం పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది సబబా కాదా అన్నది పక్కన పెడితే నిజానికి గంటా చాలా బిజీగా ఉన్నారనే అనుకోవాలి. మరి ఆయనకు చాలా పనులు ఉండబట్టే అధినాయకత్వం మీటింగ్ పెట్టి కలవమన్నా వెళ్లలేకపోయారు అని కూడా అనుకోవాలి.

ఇక ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. గంటా ఆషామాషీ నేత ఏమీ కాదు, నలుగురుతో పాటు ఆయన్ని పిలవడానికి. ఆయన ఏపీలో చాలా కీలక నాయకుడు. ఇపుడు ఏపీలో సామాజిక పరిణామాలను తీసుకుంటే కాపులు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. తమకు ఇంతకు మించిన మంచి చాన్స్ రాదు అని అనుకుంటున్నారు. అలాంటి కాపులను ఐక్యం చేసే పనిలో గంటా బిజీగా ఉన్నారని అంటున్నారు.

ఇప్పటికే గంటా నాయకత్వాన కొన్ని మీటింగ్స్ జరిగాయి. రానున్న రోజుల్లో మరి కొన్ని జరగబోతున్నాయి. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లాల్లో చూసుకుంటే డెబ్బై దాకా సీట్లలో కాపులు ప్రభావం గట్టిగా ఉంటుంది అని నమ్ముతున్నారు. అలాగే కాపుల మద్దతు ఉన్న పార్టీలే రేపటి ఎన్నికల్లో పవర్ లోకి వస్తాయని కూడా అంటున్నారు. మరి కాపులకు అంత ముఖ్య రాజకీయ భూమిక ఉన్న టైమ్ లో కీలకంగా ఉన్న గంటా నిజంగా బిజీయే కదా.

ఆయన టీడీపీలో ఇతర నాయకుల మాదిరిగా సమావేశానికి పిలిస్తే వస్తారా అన్న చర్చ కూడా ఉంది.అందుకే తాను వీలు చేసుకుని ప్రత్యేకంగా చంద్రబాబుని కలుస్తాను అని చెప్పారని అంటున్నారు. మరో వైపు చూస్తే గంటాకు అధినాయకత్వంతో కొన్ని విషయాల్లో కొంత గ్యాప్ ఉందని కూడా ప్రచారం అయితే ఉంది. ఆయన్ని బలవంతంగా 2019 ఎన్నికల్లో భీమిలీ సీటు నుంచి తప్పించారని, మొదట లోకేష్ పోటీ చేస్తారని చెప్పి చివరికి దాన్ని సబ్బం హరికి ఇచ్చారని కూడా చెబుతారు.

ఇక గంటాను విశాఖ ఎంపీగా పోటీ చేయించాలనుకున్నారని, రాష్ట్ర రాజకీయాలకు దూరం పెడదామనుకున్నారని కూడా చర్చ సాగింది. అయినా బలవంతం మీద టికెట్ తెచ్చుకుని గంటా పోటీ చేసి విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. అయితే ఒకవేళ 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా గంటాకు మంత్రి పదవి వచ్చి ఉండేది కాదు అన్నది కూడా అప్పట్లో జరిగిన మరో ప్రచారం.

ఇపుడు చూసినా విశాఖ నార్త్, భీమిలీ వంటివి పొత్తులో భాగంగా జనసేనకు పోతున్నాయని మరో టాక్ ఉంది. అంటే గంటా రేపటి రోజున టీడీపీ తరఫున పోటీ చేయాలనుకున్నా సీటు ఎక్కడ ఏమిటీ అన్నది తెలియదు అన్నమాట. అదే విధంగా గంటా అపోజిషన్ లో కూడా తనకు సరైన పొజిషన్ కోరుకున్నారని అంటున్నారు. సీనియర్ అయిన ఆయనకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి కూడా ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఉందని అంటారు. అలాగే ఆయనకు పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఆశించినా దక్కలేదు అని మరో ప్రచారం ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో చాలా మంది జూనియర్లకు కూడా పొలిట్ బ్యూరోలో స్థానం దక్కింది. మరి గంటాకు ఏమైనా పార్టీ పెద్ద పదవి ఇచ్చారా అన్నది కూడా మరో చర్చ. ఇలా చాలా విషయాల్లో గ్యాప్ ఉంది. వాటి మీద గంటా తాపీగా తీరిగ్గా పార్టీ పెద్దలతో చర్చించాల్సి ఉంది అంటున్నారు. అందుకే గంటా నలుగురితో పాటు జరిగే మీటింగునకు వెళ్లలేదు అని కూడా అంటున్నారు.

మరి గంటా వేరేగా వచ్చి కలుస్తాను అని అన్నారు. చంద్రబాబు అలా ఆయనకు అపాయింట్మెంట్ స్పెషల్ గా ఇస్తారా. ఒక వేళ గంటా తానుగా అది కోరుతారా లేక గంటాయే ఆ విషయంలో గుర్తు చేసుకుని మరీ అడుగుతారా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏతా వాతా తేలేది ఏంటి అంటే ఈ రోజుకు కూడా గంటా టీడీపీకి కాస్తా దూరంగానే ఉన్నారు. అలాగని దాన్ని దూరం అనలేరు కానీ మునుపటిలా దగ్గరగా అయితే లేరు అన్నదే తాజా ఎపిసోడ్ చెబుతున్న మ్యాటర్ అంటున్నారు.