Begin typing your search above and press return to search.

క్యాబ్ బుక్ చేస్తామని నమ్మించి.. వస్తువులు లాక్కొని దారుణం: గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు!

By:  Tupaki Desk   |   9 Jun 2022 10:33 AM GMT
క్యాబ్ బుక్ చేస్తామని నమ్మించి.. వస్తువులు లాక్కొని దారుణం: గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు!
X
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో రొమేనియన్ బాలిక ను గ్యాంగ్ రేప్ చేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడితో సహా ప్రధాన నిందితుడు సాదుద్దీన్, ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితురాలి రెండోసారి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమ్నేషియా పబ్ నుంచి ఇంటి వద్ద దింపుతామని తనను ట్రాప్‌ చేసి అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు వెల్లడించింది.

అత్యాచారం జరిగిన మే 28 సాయంత్రం మొత్తం పథకం ప్రకారం బాలికను నిందితులు ట్రాప్ చేశారని పోలీసులు తెలిపారు. పబ్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక బయటకు వచ్చేసింది. పబ్‌ లోపలికి వెళ్లేందుకు వీలుగా యాజమాన్యం ఇచ్చిన ట్యాగ్‌ను ఆమెకు తెలియకుండా తెంచేశారు. ఆమె మళ్లీ పబ్‌లోకి వెళ్లలేని పరిస్థితి కల్పించారు. ఆమెతో పాటు బయటకు వచ్చిన నిందితులు ఆమెను వెంబడించారు. క్యాబ్‌ బుక్‌ చేస్తామంటూ బాలిక ఫోన్‌ లాక్కున్నారు. ఫోన్‌ సిగ్నల్‌ సరిగా లేదని.. మీ ఇంటి వద్ద మేమే డ్రాప్‌ చేస్తామంటూ బెంజ్‌ కారులో ఎక్కించుకున్నారు.

కారులో నిందితుల్లో ఒకడు బాధితురాలి హ్యాండ్‌ బ్యాగ్‌, కళ్లజోడు లాక్కున్నారు. బంజారాహిల్స్‌వైపు కారులో వెళ్తుండగానే.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. కాన్సు బేకరీ వద్దకు వచ్చాక.. ఈ కారు ఇరుకుగా ఉందని, మరో కారు వస్తుందని చెప్పారు. తన ఫోన్‌, కళ్లజోడు, బ్యాగ్‌ ఇస్తే ఇంటికి వెళ్లిపోతానని ఆమె బతిమాలినా వినలేదు. బెదిరించి వేరే కారులో ఎక్కించారు. ఇన్నోవాలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది.

పబ్‌ నుంచి బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వరకు బెంజి కారును.. అత్యాచారానికి పాల్పడిన అయిదుగురు నిందితుల్లో చివరిగా పట్టుబడిన మైనరు (16) నడిపినట్లు పోలీసులు గుర్తించారు. బేకరీ నుంచి వెళ్లే సమయంలో ఇన్నోవా కారును ప్రభుత్వ రంగ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు నడిపినట్లు అనుమానిస్తున్నారు. కారు నడిపిన బాలురపైన, కారు ఇచ్చిన కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం కేసు నిందితులను ట్రయల్‌ సమయంలో మేజర్‌లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డును కోరారు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత ట్రయల్‌ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు విజ్ఞప్తి చేశారు.

పోలీసుల వినతిపై జువైనల్‌ జస్టిస్‌ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నిటిని పరిగణలోకి తీసుకొని బోర్డు నిర్ణయం వెల్లడించనుంది. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్‌ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు.