Begin typing your search above and press return to search.

సంచలనంగా మారిన 'ది ప్రింట్' కథనంలో ఏముంది? ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   19 April 2022 4:30 AM GMT
సంచలనంగా మారిన ది ప్రింట్ కథనంలో ఏముంది? ఏం చెప్పింది?
X
ప్రధాన మీడియా అన్నంతనే కొన్నేళ్ల క్రితం వరకు దినపత్రికలను మాత్రమే పరిగణించేవారు. తర్వాతి కాలంలో టీవీ చానళ్లు కూడా వచ్చి చేరాయి. ఇప్పుడు వెబ్ మీడియా కూడా ప్రధాన మీడియా స్రవంతిలో చేరింది. లెక్కలేనెన్ని వెబ్ సైట్లు ఉన్నా.. కొన్ని సైట్లలో వచ్చే వార్తలకు ఉండే స్పందన.. ఆ కథనాల్ని ప్రింట్ మీడియా సైతం ఫాలో అయ్యే పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల పేరుతో అందజేస్తున్న ఉచిత తాయిలాలు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ఎంత దారుణంగా మారుస్తాయన్నది పెద్ద చర్చగా మారింది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలకు శ్రీలంక ఆర్థిక పతనం ఒక పెద్ద పాఠంగా మారింది.

చరిత్రలో ఎప్పుడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్న శ్రీలంకను చూసి చాలా త్వరగా పాఠాలు నేర్చుకోవాలని.. లేకుంటే అలాంటి పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. పెట్రోల్.. డీజిల్ లాంటి నిత్యవసరాల కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలవాల్సిన పరిస్థితి ప్రస్తుతం శ్రీలంకలో ఉంది. అప్పుల కొండ భారీగా పెరగటంతో 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాల్ని చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటివేళ.. దేశంలోని ఐదు రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో పునరాలోచించుకోకుంటే శ్రీలంక లాంటి పరిస్థితి మనకూ తప్పదని తేల్చింది.

శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి పంజాబ్.. బిహార్.. రాజస్థాన్.. ఆంధ్రప్రదేశ్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మేల్కోవాల్సిన అవసరం ఉందని.. ఆయా రాష్ట్రాల్లో ఉచిత పథకాలు.. అప్పులకు తక్షణమే కోత పెట్టాల్సిన అవసరం ఉందని తేల్చింది. ఈ కథనంలో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..

- కరోనాతో కొత్త కష్టాలు మొదలైతే.. అంతకు రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రాల సొంత రెవెన్యూ రాబడులు తగ్గటంతో అప్పుల మీద ఆధారపడాల్సి వస్తోంది. 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసిన తర్వాత రాష్ట్రాలు తమ ఆదాయాల్ని ఖర్చు చేసే విషయంలో వారికి వెసులుబాటు లభించింది. చాలా రాష్ట్రాలు ప్రజాకర్షక పథకాలపైనే ఎక్కువగా ఖర్చు చేయటంతో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల తగ్గింది.

- దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గడిచిన ఐదేళ్లలో రెవెన్యూ రాబడుల కంటే వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. పలు రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి వాటిని తీర్చలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్.. యూపీ రాష్ట్రాల్లో అనేక ప్రజాకర్షక పథకాల్ని ప్రకటించారు. వీటితో ఆ రాష్ట్రాలు మరింత అప్పుల పాలు కావటం ఖాయం.

- బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రాష్ట్ర రాబడి ఐదేళ్లలో 5 శాతం పెరుగుదల ఉంటే.. వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల రేటు 6 శాతానికి పెరిగింది.

- ఏపీ.. బిహార్.. రాజస్థాన్ రాష్ట్రాల్లో అప్పుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం రుణం రూ.3.89 లక్షల కోట్లకు చేరితే.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.40వేల కోట్లు ఎక్కువ. ఏపీ జీఎస్ డీపీలో అప్పు 32.4 శాతానికి చేరుకుంది.

-ఈ సంచలన కథనంలో చెప్పిన లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక రుణ భారం పంజాబ్ రాష్ట్రానిది. ఆ రాష్ట్ర జీఎస్ డీపీలో అప్పుల వాటా ఏకంగా 53 శాతం. ఏపీలో ఉన్న మొత్తం చెల్లింపుల భారం రూ.7.76 లక్షల కోట్లను పరిగణలోకి తీసుకుంటే జీఎస్ డీపీలో అప్పుల భారం వాటా 76 శాతంగా ఉంది. అంటే పంజాబ్ కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న మాట.