Begin typing your search above and press return to search.

8 ఏళ్ల తర్వాత కూడా ఇవే మాటలా? బోరు కొట్టట్లేదా కేటీఆర్!

By:  Tupaki Desk   |   16 March 2022 12:30 PM GMT
8 ఏళ్ల తర్వాత కూడా ఇవే మాటలా? బోరు కొట్టట్లేదా కేటీఆర్!
X
చెప్పిన మాటను పదే పదే చెప్పటానికి మించిన బోరింగ్ మరొకటి ఉండదు. చెప్పేటోళ్లకు బోర్ కొట్టదేమో కానీ.. వినే వారికి మాత్రం విసుగురావటం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది మంత్రి కేటీఆర్ మాటల్ని చూస్తే. నిత్యం.. ఎవరో ఒకరి మీద గన్ను పెట్టి.. మరెవరినో కాల్చాలనుకునే తన తండ్రి కేసీఆర్ మాటల్ని బాగా పుణికి పుచ్చుకున్న కేటీఆర్.. ఇప్పుడు అలాంటి మాటల్నిఅదే పనిగా చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడటం లేదు.

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి.. కేంద్రానికి మధ్య రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలోనూ కేంద్రం తమకు సహకారం అందించటం లేదని.. ఒకవేళ అందిస్తే తెలంగాణ మరోలా ఉండేదన్న మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. మంత్రి కేటీఆర్ మాటల్లోనూ ఈ మధ్యన వినిపిస్తోంది. మీకు దమ్ముంటే ఆ ప్రాజెక్టును తీసుకొస్తారా? మీరు కేంద్రం నుంచి నిధులు తెస్తారా? లాంటి మాటల్ని మంత్రి కేటీఆర్ నోటి నుంచి వస్తూ ఉంటాయి.

తాజాగా చూస్తే.. హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి రూ.10వేల కోట్ల నిధులు తీసుకురావాలని.. అలా తీసుకొస్తే ఆయనకు పౌర సన్మానం చేస్తామని మంత్రి కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. మహానగర డెవలప్ మెంట్ కు బీజేపీ నేతలు పోటీ పడాలని ఆయన వ్యాఖ్యానించారు.

కేటీఆర్ మాటల్ని విన్నంతనే పలు ప్రశ్నలు మదిలోకి రావటం ఖాయం. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్రానిది. ఒకవేళ.. అది సాధ్యం కాకుంటే.. నిధులు తెచ్చే భారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతికి ఇచ్చే బదులు.. సీఎం సీటు కిషన్ రెడ్డికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

సవాలు ఎదురైనంతనే ఎవరో ఒకరి మీద నింద మోపే గులాబీ నేతలు.. డెవలప్ మెంట్ నిధుల కోసం కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ విషయాన్ని వదిలేసి.. కేంద్రమంత్రిని బద్నాం చేయటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని చెబుతున్నారు. ఒక కేంద్రమంత్రిగా వ్యవహరించే నేత.. తన రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేలా నిర్ణయం తీసుకుంటే ప్రశ్నిస్తాం.. విమర్శిస్తాం. అలాంటివేళలో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలో అర్థం లేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీకి ఎలాంటి సన్మానం చేశారో అందరికి తెలిసినప్పుడు.. రూ.10వేల కోట్లు తీసుకొస్తే పౌరసన్మానం లాంటి మాటలు రాజకీయ ధోరణిలో మాట్లాడే తప్పించి.. మరింకేమీ లేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి మాటలు కట్టి పెట్టి.. పాలన మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి.. న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి పోరాడి సాధించాలే తప్పించి ఇలాంటి మాటల వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోకూడదు.