Begin typing your search above and press return to search.

ఆ దేశ ప్రధాని పై సంచలన మీమ్ పోస్టు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త

By:  Tupaki Desk   |   14 Dec 2021 4:38 AM GMT
ఆ దేశ ప్రధాని పై సంచలన మీమ్ పోస్టు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త
X
దేశ అత్యున్నత స్థానంలో ఉన్న అధినేతకు మొదలు సామాన్యుడి వరకు అందరికి సమానమైన హక్కుల్ని.. విదుల్ని మన దేశ రాజ్యాంగం ప్రసాదించిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. పుస్తకాల్లో అత్యుత్తమ విలువల్ని ప్రోది చేసుకున్న మన వ్యవస్థలో.. అందుకు తగ్గట్లు పరిణామాలుచోటు చేసుకోవటం చాలా అరుదుగా చెప్పాలి. అధికారంలో ఉన్న వారేం చేసినా.. ఎలాంటి తప్పు చేసినా వేలెత్తి చూపించే సాహసం ఏ పారిశ్రామికవేత్త చేసే ప్రయత్నం చేయరు. ఒకవేళ చేస్తే.. అందుకు ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తారన్న విషయాన్ని ఇప్పటికే చైనా లాంటి దేశంలో అలీబాబా కంపెనీ అధినేత విషయంలో ఏం జరిగిందో తెలిసిందే.

అందుకు భిన్నంగా.. ప్రపంచంలో అపర కుబేరుడి స్థానంలో ఉన్న పెద్ద మనిషి.. ఒక దేశ ప్రధాని మీద విడుదల చేసిన మీమ్ సంచలనంగా మారటమేకాదు.. చివరకు హాట్ టాపిక్ గా మారింది. అన్నింటికి మించి సదరు దేశ ప్రధాని ఏకంగా సారీ చెప్పే వరకు వెళ్లింది. అంతలా సదరు ప్రధాని చేసిన తప్పును వేలెత్తి చూపించే విషయంలో సదరు పారిశ్రామికవేత్త వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ తప్పు చేసిన ప్రధాని ఎవరు? వేలెత్తి చూపుతూ మీమ్ పోస్టు చేసిన పోటుగాడైన పారిశ్రామికవేత్త ఎవరన్న విషయంలోకి వెళితే..

కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనల్ని అడ్డంగా ఉల్లంఘించిన ఫిన్లాండ్ ప్రధానమంత్రి 36 ఏల్ల సన్నా మారిన్ తీరు.. తాజాగా విమర్శలకు తావిచ్చింది. కరోనా నిబంధనల్ని ఆమె బ్రేక్ చేయటాన్ని అక్కడి ప్రజలు మాత్రమే కాదు.. టెస్లా కంపెనీ అధినేత కమ్ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం రియాక్టు అయ్యారు. ఘాటైన మీమ్ ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చివరకు దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న మహిళా నేత సన్నా.. సారీ చెప్పక తప్పలేదు. తన మంత్రివర్గానికి చెందిన విదేశాంగ మంత్రి ఇటీవల కరోనా పాజిటివ్ అయ్యారు.

అయినప్పటికీ.. ప్రధాని సన్నా మాత్రం.. గత వారాంతంలో క్లబ్ లో అందరి మధ్య గంటల సేపు ఉండటం వేలెత్తేలా చూపింది. ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారా? అన్న అర్థం వచ్చేలా ఎలాన్ మాస్కు ఒక మీమ్ విడుదల చేశారు. అందులో ఒక అమ్మాయి చెవిలో ఒక అబ్బాయి.. ‘మీరేం చేస్తుంటారు?’ అని ప్రశ్నిస్తారు. అందుకు సదరు మహిళ బదులిస్తూ.. ‘నేను ఫిన్లాండ్ ప్రధానిని’ అంటూ బదులివ్వటం.. ఆ వ్యక్తి ‘ఏంటి?’ అంటూ షాక్ కు గురి అయినట్లుగా మీమ్ ఉంది. తన విదేశాంగ మంత్రికి కరోనా సోకిందని తేలిన తర్వాత కూడా గంటల కొద్దీ క్లబ్ లో గడిపిన విషయాన్ని తనదైన రీతిలో ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన విమర్శలకు ప్రధాని సన్నా మారిన్ సారీ చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోనందుకు ఆమె చింతిస్తున్నట్లుగా వెల్లడించారు. టీకా తీసుకోవటంతో ఐసోలేషన్ లో ఉండాల్సిన పని లేదన్న సమాచారం తనకు అందిందని.. అందుకే ఇలా చేసినట్లు చెప్పారు. అయితే.. ఐసోలేషన్ లో ఉండాలంటూ వచ్చిన మెసేజ్ ను తాను చూసుకోకపోవటంతో ఇలాంటి పొరపాటు జరిగిందన్నారు. అయితే.. అనంతరం ఐసోలేషన్ కు వెళ్లటం.. ఆమెకు చేసిన కరోనా టెస్టులో నెగిటివ్ రావటం ఆమె కొంత ఊపిరిపీల్చుకునే అవకాశాన్ని ఇచ్చింది.

ఫిన్లాండ్ లో రెండు టీకా డోసుల్ని తీసుకున్న వ్యక్తి ఎవరైనా తన సన్నిహితుడికి కరోనా పాజిటివ్ అయితే..ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. కాకుంటే.. ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా ఐసోలేషన్ లో ఉండే తీరును ప్రదర్శిస్తున్నారు. అలాంటివి ప్రధాని మాత్రం అలా చేయకపోవటంపై విమర్శలు వచ్చాయి. ఏమైనా.. ఒక దేశ ప్రధాని చేసిన తప్పు (?)ను ఎత్తి చూపేలా మీమ్ పోస్టు చేసిన ఎలాన్ మాస్క్ ధైర్యాన్ని అభినందించాల్సిందే.