Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనుక సంచలన విషయాలు..సూత్రధారి అరెస్ట్

By:  Tupaki Desk   |   18 Jun 2022 6:01 AM GMT
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనుక సంచలన విషయాలు..సూత్రధారి అరెస్ట్
X
అగ్నిపథ్ ఆందోళనలతో దేశమంతా అట్టుడుకుతోంది. నిన్న తెలంగాణ సమా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఇప్పుడీ సెగ ఆంధ్రప్రదేశ్ కు కూడా తగిలింది. ఆంధ్రాలో కూడా నిరసనల సమాచారంతో రైల్వే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ రైల్వేస్టేషన్ ను మూసివేస్తున్నామని.. స్టేషన్ లోకి ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద.. హవ్ డా నుంచి వచ్చే వాటిని కొత్త వలస వద్ద నిలిపివేసి దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్ కు రైళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకు్నారు. రైల్వేస్టేషన్ కు అరకిలోమీటర్ మేర ముందే బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటల వరకూ ఉన్న ప్రయాణికులను తనిఖీ చేసి స్టేషన్ లోకి అనుమతించారు. విశాఖ ఆర్మీ రిక్రూట్ మెంట్ అధికారి కార్యాలయం వద్ద భారీ స్థాయిలో బలగాలను మోహరించారు.

-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనుక సంచలన విషయాలు..సూత్రధారి అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనకు నరసారావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఖమ్మంలో అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించారు. అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందంటూ వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మిగతా ప్రైవేట్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళనకారులకు సహకరించినట్లు గుర్తించారు.

సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్ కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్ లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్టు పోలీసులు తేల్చారు.

-విశాఖ రైల్వే స్టేషన్ మూత.. రైళ్లు నిలిపివేత.. మళ్లింపు

విశాఖ స్టేషన్ ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేశారు. ఎవరినీ అనుమతించడం లేదు. విశాఖరైల్వే స్టేషన్ మూసివేయడంతో పలు రైళ్లను దువ్వాడ, కొత్తవలస, అనకాపల్లి స్టేషన్ల వద్దే అధికారులు నిలిపివేయనున్నారు. విశాఖ-గోదావరి ఎక్స్ ప్రెస్, కాచిగూడ-విశాఖ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ గరీబ్ రథ్, లోకమాన్య తిలక్-విశాఖ, కడప-విశాఖ తిరుమల ఎక్స్ ప్రెస్ రైళ్లను దువ్వాడ వద్ద నిలిపివేయనున్నారు. దిఘా-విశాఖ రైలును కొత్త వలస వద్ద నిలిపివేయనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం-విశాఖ, కాకినాడ-విశాఖ, తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైళ్లను అనకాపల్లి స్టేషన్ లో నిలిపివేశారు.