Begin typing your search above and press return to search.

ఈ ఒక్క ఫ్లెక్సీ.. అందరినీ కదిలిస్తోంది..

By:  Tupaki Desk   |   4 May 2019 5:17 AM GMT
ఈ ఒక్క ఫ్లెక్సీ.. అందరినీ కదిలిస్తోంది..
X
నాలుగు రోజులు లొల్లి జరిగింది.. తర్వాత అంతా సర్దుకుంది.. 45 డిగ్రీల ఎండలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎన్నాళ్లని కొట్లాడుతారు.. మౌనం దాల్చిన కేసీఆర్ నుంచి ఏ సమాధానాన్ని ఆశిస్తారు.. అంతా తూచ్.. అందుకే ఉవ్వెత్తిన ఎగిసిన ‘ఇంటర్’ అవకతవకల వేడి చప్పున చల్లారింది. ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు.. ప్రభుత్వం చేస్తోంది ఏమీ లేదు..

ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం.. కాంట్రాక్ట్ చేపట్టిన గ్లోబరీనా సంస్థ నిర్వాకం.. అధికారుల చూసీ చూడని తత్వం ఇలా అందరూ చేసిన పనికి పాపం విద్యార్థులు బలైపోయారు. 23మంది ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణంగా చెప్పవచ్చు. ఓ రకంగా ఇది ప్రభుత్వం చేసిన హత్యలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అయితే ఇంటర్ బోర్డుతో పాటు గ్లోబరీనా సంస్థ తప్పు ఉందని త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. అంత తీవ్రంగా శోధించి ప్రభుత్వానికి అందించినా దున్నపోతు మీద వానపడ్డ చందంగా ఇంతవరకూ బాధ్యులపై చర్యలు లేవు. అసలు ఆ నివేదికలో ఏముంది? ఎందుకు గ్లోబరీనాపై చర్యలు తీసుకోలేదో ఆ దేవుడికి.. ఈ తెలంగాణ దేవుడికే తెలియాలి.. గ్లోబరీనా సంస్థ ఓ పెద్దాయనకు దగ్గరి సంస్థ అని అందుకే చర్యలు లేవన్న ప్రశ్నలకు జవాబులు లేవు. ఇలా ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో అవాంతరాలు.. ఇంటర్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయో లేదోనన్న టెన్షన్ నెలకొంది.

అయితే ఇంటర్ వివాదంలో తప్పు ఎవరిది అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నుంచి వ్యక్తమవుతోంది. 23 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు అంటూ తాజాగా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో వెలిసిన పోస్టర్ ఆలోచింపచేస్తోంది. ఈ పాపానికి బాధ్యులు తల్లిదండ్రులా, ఉపాధ్యాయులా? విద్యావ్యవస్థా.. లేక ప్రభుత్వమా అని సంధించిన ప్రశ్నలున్న ఫెక్సీ ఫొటో వైరల్ అవుతుంది. ఎంత గొంతుచించుకున్న ఆ ప్రశ్నలకు సమాధానం మాత్రం రావడం కల్లా.. ఏదో మన ఆత్మ సంతృప్తికి అలా రాసుకోవడం తప్పితే ఏ ప్రయోజనం ఉండదు..