Begin typing your search above and press return to search.

కడపలో జగన్ కి సరైన ప్రత్యర్ధి...?

By:  Tupaki Desk   |   19 Feb 2022 11:44 AM GMT
కడపలో జగన్ కి సరైన ప్రత్యర్ధి...?
X
కడప అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ బంధం ఆ కుటుంబానిది. ఎందరినో కుటుంబ సభ్యులను చట్టసభలకు పంపిన ఘనత కడపది. అలాంటి కడపలో ఒకే ఒకసారి మాత్రం వైఎస్సార్ ఫ్యామిలీతో వైఎస్సార్ ఫ్యామిలీ ఢీ కొట్టింది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఆయన కడప ఎంపీగా పోటీ చేస్తే పులివెందుల సీటులో వైఎస్సార్ సతీమణి విజయమ్మకు పోటీగా కాంగ్రెస్ తరఫున వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేశారు.

ఈ ఎన్నిక 2011 మే నెలలో జరిగింది. పులివెందులలో వైఎస్ విజయమ్మ వివేకా మీద గెలిచారు. ఆ తరువాత వివేకా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక 2019 మార్చిలో ఆయన మరణించేదాకా వైసీపీలోనే ఉన్నారు. ఇక ఆయ‌న దారుణ హత్యకు గురి అయిన తరువాత మరోసారి వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా కుమార్తె డాక్టర్ సునీత అయితే ఏకంగా తన అన్న జగన్ కి ఎదురునిలిచిన వైనం ఇపుడు కనిపిస్తోంది.

ఆమె సీబీఐ విచారణ కోరుతూ హై కోర్టులో కేసు వేసి మరీ వివేకా హత్య కేసును పరుగులు పెట్టిస్తున్నారు. ఒక విధంగా ఆమె కసితో పనిచేస్తున్నారు అనే చెప్పాలి. తన తండ్రిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకులు ఎవరైనా బయటకు రావాల్సిందే అని ఆమె అంటున్నారు. ఈ విషయంలో ఆమె జగన్ సర్కార్ కి ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కడప జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

వివేకా దారుణ హత్య వెనక ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. హంతకులను జగన్ కాపాడుతున్నారని కూడా ఆ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఇక సునీత పోరాటానికి టీడీపీ నైతికంగా మద్దతు ఇస్తోంది. అదే టైమ్ లో కడపలో వైఎస్సార్ ఫ్యామిలీలో వచ్చిన చీలికను తనకు అనుకూలంగా మలచుకోవడానికి టీడీపీ చురుకుగా పావులు కదుపుతోంది అంటున్నారు

ఒక విధంగా వివేకా హత్య కేసు తరువాత సీబీఐ దర్యాప్తు నేపధ్యంలో వైఎస్సార్ కుటుంబం పట్ల అత్యంత అభిమానం చూపే కడప వాసులల్లో కూడా కొత్త అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇక్కడ జగన్ మీద కానీ ఆయన ప్రభుత్వం మీద కానీ సందేహాలు రేకెత్తించేలా టీడీపీ ఆరోపణలు కూడా దానికి కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితులలో కడప కంచుకోటను బద్ధలు కొట్తడానికి టీడీపీ పకడ్బంధీగా వ్యూహరచన చేస్తోంది.

ఈ క్రమంలో సునీతను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు. సునీత కనుక టీడీపీలో చేరితో పులివెందులలో ఏకంగా జగనే సరైన ప్రత్యర్ధిగా మారుతారని లెక్కలు వేస్తున్నారు. అదే విధంగా కడప జిల్లా అంతటా కూడా ఆమె ప్రభావం ఉంటుందని, ఫలితంగా వైసీపీ కంచుకోట కడపలో సైకిల్ పార్టీని పరుగులు పెట్టించవచ్చునని కూడా అంచనా వేసుకుంటోంది. ఈ మేరకు ఒక సీనియర్ టీడీపీ నేతను సునీత వద్దకు రాయబారం పంపించినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఆమె మనసు తెలుసుకోవడానికి ఆ టీడీపీ నేత యత్నిస్తున్నారని చెబుతున్నారు. సునీత కనుక ఓకే అంటే మాత్రం కడప రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోవడం ఖాయం. వైఎస్సార్ కుటుంబంలో వచ్చిన చీలిలతో టీడీపీ బలపడే అవకాశాలు కూడా ఈసారి ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి సునీత ఎలా రియాక్ట్ అవుతుందో. ఆమె ఓకే అంటే మాత్రం కడప గడపలో జగన్ కి సరికొత్త రాజకీయ ప్రత్యర్ధి రెడీ అయినట్లే.