Begin typing your search above and press return to search.

ఆ మాజీ సీఎంకు రోజూ కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడట

By:  Tupaki Desk   |   5 Jan 2022 4:20 AM GMT
ఆ మాజీ సీఎంకు రోజూ కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడట
X
అనూహ్యంగా దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అఖిలేశ్ యాదవ్.. తన చేతికి వచ్చిన అవకాశాన్ని రెండోసారి కంటిన్యూ అయ్యేలా చేసుకోలేకపోయారు. తన చేతి నుంచి చేజారిన సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవటానికి తెగ ప్రయత్నం చేస్తున్న ఆయన.. మరో రెండు మూడు నెలల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాంటి ఆయన నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తనకు రోజూ కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని.. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధిస్తుందని.. ప్రభుత్వాన్ని.. రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్న అఖిలేశ్ యాదవ్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యే మాధురి వర్మ తమ పార్టీలో చేరిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన నోటి నుంచి ఆణిముత్యాల్లాంటి ఈ మాటలు వెలువడ్డాయి.

రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ ఏర్పడినప్పుడే రామరాజ్యం ఏర్పాటవుతుందని చెప్పిన అఖిలేశ్.. రోజూ రాత్రివేళ కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని చెప్పటం కాస్తంత కామెడీగా మారిందని చెప్పాలి. అయినా.. రామరాజ్యం ఏర్పాటు చేస్తావని దీవించాల్సింది శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కాదు కదా? చెప్పే మాటలు కాస్తంత సింక్ అయితే బాగుంటుంది కానీ.. ఇలా శ్రీకృష్ణుడు పేరుతో చెబుతున్న ఆయన మాటలకు మరెన్ని ఓట్లు పడతాయో చూడాలి. తమ ఇష్టదైవమైన శ్రీకృష్ణుడు.. అఖిలేశ్ యాదవ్ కలలోకి రావటం బాగానే ఉంది.. పనిలో పనిగా శ్రీరాముడ్ని కూడా తీసుకొచ్చేసి.. ఏదైనా సందేశం ఇప్పిస్తే బాగుండేది కదా?

ఇక.. కలలో దేవుడు కనిపించే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. యూపీని ప్రస్తుతం పాలిస్తున్న యోగి సర్కారు తీరుపై గయ్యిమంటున్నారు. అన్ని విధాలుగా యోగి సర్కారు ఫెయిల్ అయ్యిందన్న అఖిలేశ్.. యూపీకి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు రావటమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఫెయిల్ అయ్యే విద్యార్థులకు వారి తల్లిదండ్రులు సాయం చేసేలా.. యోగి ఆదిత్యనాథ్ కు బీజేపీ పెద్దలు సాయం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. మరి.. అఖిలేశ్ కలలో కనిపించే శ్రీకృష్ణుడు మాటలు ఎంతవరకు నిజమన్నది కాలమే సమాధానం ఇవ్వాలి.