Begin typing your search above and press return to search.

మాజీ ఉప‌రాష్ట్రప‌తిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన 'రా' మాజీ అధికారి!

By:  Tupaki Desk   |   8 July 2019 5:48 PM IST
మాజీ ఉప‌రాష్ట్రప‌తిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన రా మాజీ అధికారి!
X
నిజ‌మా? అబ‌ద్ధ‌మా? అన్న‌ది ఏ మాత్రం తేల్చ‌లేని రీతిలో ఉన్న ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. తాజా వ్య‌వ‌హారాన్ని చూస్తే.. ఇలాంటివి రీల్ లో మాత్ర‌మే ప‌రిమిత‌మైనవిగా చెప్పాలి. ఇలాంటి స‌న్నివేశాన్ని రియ‌ల్ గా చూడాల్సి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేనివి. రిటైర్డ్ దౌత్య‌వేత్త‌.. మాజీ ఉప‌రాష్ట్రప‌తి హ‌మీద్ అన్సారీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు "రా" మాజీ అధికారి ఎక్ కే సూద్‌.

భార‌త అత్యున్న‌త గూఢాచార సంస్థ అయిన "రా" గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఈ సంస్థ‌లో ప‌ని చేసిన ఆయ‌న‌.. దౌత్య‌వేత్త‌గా వ్య‌వ‌హ‌రించే స‌మ‌యంలో హ‌మీద్ అన్సారీ చేసిన పనుల కార‌ణంగా రాకు చెందిన కొంద‌రి జీవితాల‌ను ఆయ‌న ప్ర‌మాదంలోకి నెట్టిన‌ట్లుగా ఆరోపించారు. భార‌త రాయ‌బారిగా టెహ్రాన్ లో ఉన్న‌ప్పుడు రా కార్య‌క‌లాపాల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించార‌న్నారు.

అలాంటి వ్య‌క్తిని రెండుసార్లు వ‌రుస‌గా ఉప‌రాష్ట్రప‌తిగా ఎలా నియ‌మిస్తార‌ని ప్ర‌శ్నించారు. 2010లో విదేశీ గూఢాచార సంస్థ నుంచి రిటైర్ అయిన సూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ లో అన్సారీ భార‌త రాయ‌బారిగా ఉన్న‌ప్పుడు.. "రా" అధికారిగా తాను అక్క‌డే ప‌ని చేశార‌న్నారు.

''టెహ్రాన్‌ లో అన్సారీ భారత రాయబారిగా ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. అక్క‌డున్న‌ "రా" యూనిట్‌ను బహిర్గతం చేయడంలో అన్సారీ కీలక పాత్ర పోషించారు. ఈ కార‌ణంగా అక్క‌డి యూనిట్ సభ్యుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టారు. అలాంటి వ్యక్తికి రెండుసార్లు వరుసగా ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టారు...'' అని పేర్కొన్నారు.

అన్సారీ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని రా మాజీ అధికారులు కొంద‌రు 2017లో ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. అయితే.. అప్ప‌ట్లో ఆ వాద‌న‌కు పెద్ద ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా సూద్ ఇదే అంశాన్ని మ‌రోసారి లేవ‌నెత్త‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. ఇదే అంశంపై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. మేధావిగా పేరు ప్ర‌ఖ్యాతుల‌పై ప‌లు సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టే సుబ్ర‌మ‌ణ్య స్వామి స్పందించారు.

అన్సారీ ఒక క‌మ్యేనిస్టు వ్య‌క్తి అని.. ఆయ‌న్ను యూపీఏ ప్ర‌భుత్వం వెన‌కేసుకొచ్చింద‌న్నారు. 1961లో భార‌త విదేశాంగ శాఖలో చేరిన అన్సారీ.. ఇరాక్.. మొరాకో.. బెల్జియం.. సౌదీ అరేబియాతో స‌హా ప‌లు దేశాల్లో ప‌ని చేశారు. 1976-99 వ‌ర‌కు ఆస్ట్రేలియా.. యూఏఈ.. ఆఫ్ఘ‌నిస్తాన్.. ఇరాన్.. సౌదీ అరేబియాతో స‌హా ప‌లు దేశాల్లో భార‌త దౌత్యాధికారిగా వ్య‌వ‌హ‌రించారు. ఇంత‌టి ప్రొఫైల్ ఉన్న వ్య‌క్తి మీద మాజీ రా అధికారి ఒక‌రు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మ‌రి.. దీనిపై మోడీ స‌ర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.