Begin typing your search above and press return to search.

సడన్ గా వచ్చి ఇసుక పోసి.. నాశనం అయిపోతావ్ అంటూ శాపనార్థాలు

By:  Tupaki Desk   |   5 Aug 2021 12:30 PM GMT
సడన్ గా వచ్చి ఇసుక పోసి.. నాశనం అయిపోతావ్ అంటూ శాపనార్థాలు
X
జూనియర్.. సీనియర్ విభేదాలు.. ఆఫీసుల్లో అధికారుల మధ్య మనస్పర్థలు.. వేధింపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఆఫీసులో ఒక్కో రామాయణం ఉంటుంది. అయితే.. తనను అదే పనిగా ఇబ్బంది పెడుతున్న ఒక ఉన్నతాధికారిపై ఒక మహిళా అధికారి వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ వినని రీతిలో చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆఫీసుకు వచ్చి.. తనకు విబేదాలున్న అధికారి ముందుకు వెళ్లి.. హటాత్తుగా మీద ఇసుక పోసి.. నాశనమైపోతావ్ అంటూ శాపనార్థాలు పెట్టిన మహిళా అధికారి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగింది? ఇసుక పోసు పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిణామంపై సదరు అధికారులు ఇద్దరు ఏమంటున్నారు అన్న విషయానికి వస్తే..

విశాఖ దేవాదాయ శాఖలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తేడా వచ్చినప్పుడు మాటా మాటా అనుకోవటం.. తిట్టిపోసుకోవటం.. మరో అడుగు ముందుకు వెళ్లి తన్నుకోవటం లాంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా ఏపీ దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ పుష్ఫవర్ధన్ పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహరించిన తీరు అనూహ్యంగా ఉందని చెప్పాలి.

ఆఫీసులో పని చేస్తున్న పుష్పవర్ధన్ వద్దకు వచ్చిన శాంతి.. ఆయనపై ఇసుక పోసి.. నాశనం అయిపోతావ్ అంటూ శాపనార్థాలు పెట్టి.. ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవటం సదరు కార్యాలయంలో సంచలనంగా మారింది. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోవటం పుష్పవర్దన్ వంతైంది. ఈ అనూహ్య చర్యకు పాల్పడిన శాంతి మాట్లాడుతూ.. డిప్యూటీ కమిషనర్ తనను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తనను మానసికంగా ఆవేదనకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు.

గతంలో ఉన్న వ్యక్తిగత కక్షల్ని మనసులో పెట్టుకొని తనను డిప్యూటీ కమిషనర్ సాధిస్తున్నారని.. గతంలో కూడా ఆయనపై ఆర్జేడీకి తాను కంప్లైంట్ చేశారని చెప్పారు. ఆయనపై తాను క్రిమినల్ కేసు ఫైల్ చేస్తానన్నారు. ఇదిలా ఉంటే.. డీసీ పుష్ప వర్ధన్ మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. సదరు మహిళా అధికారి తీరుకు తాను షాక్ తిన్నానని.. తాను ఇలా జరుగుతుందని ఏ మాత్రం ఊహించలేదన్నారు. తమ మధ్య ఎలాంటి వివాదాలు కానీ.. విబేదాలు కానీ లేవన్నారు. తాను విశాఖలో డ్యూటీకి వచ్చి నెలరోజులే అవుతుందని చెప్పారు.

సడన్ గా అసిస్టెంట్ కమిషనర్ శాంతి వచ్చి ఇసుక పోసి.. నాశనం అవుతావని శాపనార్థాలు పెట్టేసరికి తాను షాక్ తిన్నానని.. తాను ఎన్నోచోట్ల పని చేసినా.. ఇలాంటి పరిస్థితి తనకు ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. సదరు మహిళా ఉద్యోగి తీరుపై దేవాదాయ కమిషనర్ కు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు. మరి.. ఈ ఉదంతం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.