Begin typing your search above and press return to search.

వైసీపీలో సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్లు... ఎందాకా... ఎన్నేళ్లో ?

By:  Tupaki Desk   |   20 May 2021 11:14 AM IST
వైసీపీలో సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్లు... ఎందాకా... ఎన్నేళ్లో ?
X
ఏపీలో ఓ వైపు క‌రోనా వీరంగం ఆడుతుంటే.. అటు అధికార పార్టీలో క‌ల‌హాల కాపురాలు పెరిగిపోతున్నాయి. సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య ఎప్ప‌టి నుంచో ఉన్న విబేధాలు త్వ‌ర‌లో జ‌రిగే మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న నేప‌థ్యంలో మ‌రింత పెరిగి పెద్ద‌వి అవుతున్నాయి. మిగిలిన జిల్లాల సంగ‌తి ఎలా ఉన్నా ఏపీలో నెల్లూరు జిల్లాలో సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్ల మ‌ధ్య వార్ క‌రోనా వేళ కూడా ముదిరి పాకాన ప‌డింది. యేడాదిన్న‌ర కాలంగానే ఈ జిల్లాలో వైసీపీ నేత‌ల మ‌ధ్య పొసిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇక ఇప్పుడు సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్ల మ‌ధ్య ఓ వార్ న‌డుస్తుంటే.. జూనియర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్ల మ‌ధ్య మ‌రో వార్ న‌డుస్తోంది. దీంతో అస‌లు జిల్లాలో ఏ నేత ఎవ‌రితో స‌ఖ్య‌త‌తో ఉన్నారో కూడా అర్థం కాని ప‌రిస్థితి. ఉన్నంత‌లో రెండు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన సూళ్లూరుపేట‌లో మాత్ర‌మే కాస్తంత ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది.

నెల్లూరు జిల్లాలో ఊహించని విధంగా ఇద్దరు జూనియర్లకు కీలక పదవులిచ్చి సీనియర్లకు షాకిచ్చారు జగన్. ఇది పార్టీలో చాలా మందికి న‌చ్చ‌డం లేదు. జూనియ‌ర్లుగా ఉన్న మేక‌పాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్ ఇద్ద‌రూ పేరుకు మాత్ర‌మే జూనియ‌ర్లు.. అయితే వీరిద్ద‌రు కూడా రెండోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. అయితే ఇదే జిల్లాలో న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి, కిలివేటి సంజీవ‌య్య‌, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి లాంటి నేత‌లు కూడా రెండు లేదా అంత‌క‌న్నా ఎక్క‌కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారే.

స‌రే ఎంత మంది ఉన్నా రేపు జ‌రిగే కేబినెట్ మార్పుల్లో ప్ర‌ధానంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఎవ‌రికి వారు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ రేసులో ఆనం త‌న చ‌ర్య‌ల‌తో పార్టీ అధిష్టానం ద‌గ్గ‌ర బ్యాడ్ అవ్వ‌డంతో ఆయ‌న వెన‌క‌ప‌డిపోయారు. ఇక ప్ర‌స‌న్న‌కుమార్‌, కాకాణి మ‌ధ్యే అస‌లు సిస‌లు పోటీ ఉండ‌వ‌చ్చు. ఇక ప్ర‌స్తుత మంత్రులు ఇద్ద‌రూ కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు చేస్తోన్న ప‌నుల‌కు త‌గినంత ప్ర‌చారం రాకుండా అధికారుల‌ను మేనేజ్ చేస్తున్నార‌న్న గుస్సాతో కొంద‌రు నేత‌లు ఉన్నారు.

సీనియ‌ర్ అయిన ఆనం ఆయ‌న చ‌ర్య‌ల ద్వారానే సైడ్ అయిపోయారు. ఇక ఇప్పుడు గౌతంరెడ్డి వ‌ర్సెస్ అనిల్ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం అయితే ముదిరిపాకాన ప‌డింది. ఓ సామాజిక వ‌ర్గం నేత‌లు అంతా గౌతంరెడ్డి వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. ఇక నెక్ట్స్ కేబినెట్ రేసులో ఉన్న ప్ర‌స‌న్న‌కుమార్‌, కాకాణి మ‌ధ్య కూడా అంత‌ర్గ‌త యుద్ధం పెద్ద‌దైన‌ట్టు భోగ‌ట్టా ? ఇక కాకాణి వ‌ర్సెస్ కోటంరెడ్డి మ‌ధ్య విబేధాలు తీవ్రంగానే ఉన్నాయి. ఆనంకు అనిల్‌, కోటంరెడ్డితో ఉన్న విబేధాల నేప‌థ్యంలో ఆయ‌న గౌతంరెడ్డి, ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక ఎస్సీ వ‌ర్గంలో రెండోసారి గెలిచిన కిలివేటి సంజీవ‌య్య‌ను కూడా ఓ సామాజిక వ‌ర్గం సీనియ‌ర్లు టార్గెట్ చేస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న‌తో ఉన్నారు. ఏదేమైనా రెండో విడ‌త మంత్రి ప‌ద‌వి నెల్లూరు జిల్లా అధికార పార్టీ నేత‌ల్లో కాక రేపుతోంది.