Begin typing your search above and press return to search.

ఆ లేడీ సింగం ఇక .. ఉగ్రవాదుల కోటలోకి..ఏరివేతకిక సై

By:  Tupaki Desk   |   2 Sept 2020 8:00 AM IST
ఆ లేడీ సింగం ఇక .. ఉగ్రవాదుల కోటలోకి..ఏరివేతకిక  సై
X
ఆ తెలంగాణ కేడర్ మహిళా ఐపీఎస్ ఉగ్రవాదుల కోటలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతవరకు ఏ మహిళా ఐపీఎస్ చేపట్టని బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఆమెకు తొలిసారిగా అప్పగించింది. ఆమె ట్రాక్ రికార్డు పరిశీలించిన తర్వాతే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె మరెవరో కాదు ఐపీఎస్ చారు సిన్హా. ఈమె 1996 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారిణి. తెలంగాణ, సీమాంధ్రలోనూ ఈమె పనిచేశారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆమె తెలంగాణ కేడర్ కు వెళ్ళిపోయారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమెకు హోం మంత్రిత్వ శాఖ కొత్తగా జమ్మూకాశ్మీర్ లో పోస్టింగ్ ఇచ్చింది. సీఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా నియమించింది. శ్రీనగర్ ఐజీగా బదిలీ చేసింది. సీఆర్పీఎఫ్ శ్రీనగర్ సర్కార్ ఐజీగా ఓ మహిళా ఐపీఎస్ అధికారిని నియమితులు కావడం ఇదే మొదటి సారి. అందుకే ఆమె నియామకం ప్రకటించగానే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు హోరెత్తుతోంది. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. నిరంతరం ఉగ్ర వాదుల కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్లతో పాటు కార్డెన్ సర్చ్ నిర్వహించాల్సి ఉంటుంది. నిరంతరం ఎన్ కౌంటర్లలో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలను చారుసిన్హా స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఇదివరకు చారుసిన్హా బీహార్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి మావోయిస్టుల ఏరివేతలో క్రియాశీలకంగా పని చేశారు. ఆమె పనితీరును పరిశీలించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమెను శ్రీనగర్ ఐజీగా బదిలీ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చారుసిన్హా పలు ప్రాంతాల్లో కీలక పదవులు నిర్వహించారు. రాజకీయంగా ప్రాధాన్యం కలిగిఉన్న పులివెందుల, ఏలూరు ఏఎస్పీగా పని చేశారు. మెదక్ జిల్లాలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ హెడ్ గా వ్యవహరించారు. ప్రకాశం, చిత్తూరు, నిజాంబాద్ జిల్లాల్లో ఎస్పీ గా పని చేశారు. కొన్నేళ్ల కిందటే ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్లి సీఆర్పీఎఫ్ లో కొనసాగుతున్నారు.