Begin typing your search above and press return to search.

లాంగ్ లీవ్ లో ఏబీ..అటు నుంచి అటే ఢిల్లీకి

By:  Tupaki Desk   |   13 Jun 2019 3:21 PM GMT
లాంగ్ లీవ్ లో ఏబీ..అటు నుంచి అటే ఢిల్లీకి
X
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు... ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరే. తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీకి అనుకూలుడిగా పేరు పడ్డ ఏబీ... టీడీపీ హయాంలో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా వ్యవహరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే.... కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన వైసీపీ... ఏబీని ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించే దాకా వదలలేదనే చెప్పాలి. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏబీ... ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ... ఏబీని బదిలీ చేయించేసింది.

తాజాగా ఎన్నికలు ముగియడం, టీడీపీ ఓటమిపాలు కావడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో టీడీపీ అనుకూలుడిగా ముద్రపడ్డ ఏబీ కి ఎక్కడా పోస్టింగే దక్కలేదు. మొన్నటి ఐపీఎస్ అధికారుల బదిలీ సందర్భంగా కూడా ఏబీని జగన్ పట్టించుకోలేదు. పోస్టింగూ ఇవ్వలేదు. దీంతో భవిష్యత్తులో ఇక ఏపీలో తనకు కీలక బాధ్యతలు కాదు కదా... కనీసం పోస్టింగ్ కూడా దక్కదన్న భావనకు వచ్చేసిన ఏబీ... ఏకంగా ఓ నెల పాటు లాంగ్ లీవ్ పెట్టేశారు. ఈ నెల 1ననే సెలవుపై వెళ్లిన ఏబీ... ఈ నెలాఖరులో అంటే 29న సెలవు ముగించుకుని తిరిగి రానున్నారు. అంటే... ఈ నెల 28 దాకా ఆయన సెలవులో ఉన్నట్లే లెక్క.

సెలవు ముగించుకుని వచ్చినా తనకు ఎలాంటి పదవి దక్కదన్న భావనకు వచ్చిన ఏబీ... ఏకంగా ఏపీలో పనిచేసేది లేదని దాదాపుగా నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే తనను కేంద్ర సర్వీసులకు పంపాలని కూడా ఆయన ఇప్పటకే దరఖాస్తు కూడా చేసుకున్నారట. ఈ దరఖాస్తు ఇప్పుడు పరిశీలనలో ఉందట. త్వరలోనే ఏబీకి అనుకూలంగానే కేంద్రం నిర్ణయం వెలువడే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా లాంగ్ లీవ్ లో వెళ్లిన ఏబీ.. అటు నుంచి అటే సెంట్రల్ సర్వీసులకు వెళ్లిపోవడం ఖాయమేనన్న మాట.