Begin typing your search above and press return to search.

కరోనా సోకి ప్లాట్ అమ్మి చికిత్స.. అయినా ప్రాణం పోయింది

By:  Tupaki Desk   |   27 May 2021 10:06 AM IST
కరోనా సోకి ప్లాట్ అమ్మి చికిత్స.. అయినా ప్రాణం పోయింది
X
కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాల్ని దెబ్బ తీస్తోంది. అప్పటివరకు సాగిన జీవితాల్ని ఒక్కసారిగా క్రాస్ రోడ్ మీద నిలబడేలా చేస్తోంది. ఆర్థికంగా పెను భారంగా మారటమే కాదు.. ఉన్న ఆస్తుల్ని అమ్మేసిన తర్వాత కూడా ప్రాణాలు దక్కని వైనం తెలిస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. వరంగల్ పట్టణానికి చెందిన 45 ఏళ్ల రాజన్ బాబు హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుంటాడు.

ఐరన్.. సిమెంట్ బిజినెస్ తో పాటు జిమ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య.. ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందరికి కరోనా సోకింది. హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి భిన్నంగా రాజన్ బాబు ఆరోగ్యం క్షీణించటంతో కూకట్ పల్లిలోని మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు లక్ష చొప్పున ఖర్చు చేశాడు. చేతిలో డబ్బులు అయిపోవటంతో ప్రాణం దక్కితే చాలు అన్న ఉద్దేశంతో.. ఫ్లాట్ అమ్మేశాడు.

అలా వచ్చిన డబ్బులతో పాటు కరోనా చికిత్స కోసం మొత్తం రూ.46లక్షలు ఖర్చు చేశాడు. తాజాగా అతడి పరిస్థితి విషమించి.. బుధవారం తెల్లవారుజామున మరణించాడు. లక్షలాది రూపాయిలు వెచ్చించినా.. ప్రాణాలు దక్కకపోవటంతో.. ఇతగాడి ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఈ మధ్యనే రాజన్ బాబు తల్లి.. సోదరి కూడా కరోనా కాటుకు బలయ్యారు. ఇదంతా విన్నాక.. ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదన్న భావన కలగటం ఖాయం.