Begin typing your search above and press return to search.

ఒక్క సెల్ఫీ... అతని ప్రాణాలు కాపాడేసింది

By:  Tupaki Desk   |   27 Jun 2019 7:06 AM GMT
ఒక్క సెల్ఫీ... అతని ప్రాణాలు కాపాడేసింది
X
రైలు పట్టాలపై, రైలు ఇంజిన్లపై సెల్ఫీలు దిగి ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకున్నవారి గురించి తరచూ వార్తలు చదువుతుంటాం. అందుకే చాలా ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడంపై ఆంక్షలుంటాయి. అయినా, సెల్ఫీ పిచ్చి ఉన్నవారు వాటిని పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే... ఇలాంటి సెల్ఫీ ప్రమాదాల ఘటనలకు విరుద్ధంగా.. తాజాగా సెల్ఫీ కారణంగా ఒక నిండు ప్రాణం నిలిచింది.

కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి భార్యతో విభేదాల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని రైల్వే ట్రాక్‌ పై పడుకుని సెల్ఫీ దిగి నేను చనిపోవాలనుకుంటున్నాను అని స్నేహితులకు సందేశం పంపించాడు. వెంటనే అతని స్నేహితులు అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అతను పంపిన సెల్ఫీలో రైల్వేకు చెందిన పసుపు రంగులోని మైలు రాయి ఒకటి వారికి కనిపించింది. వెంటనే వారి మిత్రుల్లో ఒకరు రైల్వే అధికారుల వద్దకు వెళ్లి సమాచారం అందించగా ఆ మైలు రాయి ప్రదేశాన్ని గుర్తించారు. ఆ మార్గంలో వెళ్లే రైళ్లను నిదానంగా వెళ్లాలని సూచించి... ఈ లోగా అంతా అక్కడకు చేరుకుని ఆయన్ను కాపాడారు.

ఆత్మహత్య నుంచి కాపాడడంతో సరిపెట్టకుండా మొగుడూపెళ్లాలిద్దరికీ కౌన్సెలింగ్‌ చేశారు. చిన్నచిన్న విషయాలకు తగాదాలకు దిగబోమని వారి నుంచి హామీపత్రం తీసుకుని వదిలిపెట్టారు. ఆత్మహత్యలకు ముందు చాలామంది సెల్ఫీలు దిగడమో.. సెల్ఫీ వీడియోలు తీసుకోవడమో చేస్తున్నా ఇంతవరకు ఎవరినీ ఇలా కాపాడిన ఘటనలు లేవు. ఈ కేరళ వ్యక్తి మాత్రం సెల్ఫీ కారణంగా ప్రాణాలతో బయటపడ్డాడు.